Fri. Mar 29th, 2024
AP-FOOD-COMMISSION

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, అమరావతి, అక్టోబర్19,2022: అర్హులైన పేదలందరికీ ఆహార భద్రత కల్పించడానికి ఆంధ్ర ప్రదేశ్ ఆహార కమిషన్ పనిచేస్తున్నదని కమిషన్ చైర్మన్ సి.హెచ్. విజయ ప్రతాప రెడ్డి అన్నారు. విజయవాడ అశోక్ నగర్ లోని ఆంధ్ర ప్రదేశ్ ఆహార కమిషన్ కార్యాలయంలో బుధవారం కమిషన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.

సమావేశం అనంతరం కమిషన్ చైర్మన్ విజయప్రతాప రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 ప్రకారం ఆకలి మరణాలు ఉండకూడదని ఈ దిశగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల ద్వారా అర్హులైన వారందరికీ బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు.

AP-FOOD-COMMISSION

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహార కమిషన్ రాష్ట్రంలో ది. 7-8-2017 నుండి పనిచేస్తున్నదన్నారు. ఆహార కమిషన్ చైర్మన్ గా ఇంతవరకూ 19 జిల్లాలలో పర్యటించి 366 సెంటర్ లను తనిఖీ చేసి కొన్ని ప్రాంతాలలో జరుగుతున్న లోటుపాట్లను గుర్తించి చర్యలు తీసుకున్నామన్నారు. 6A కేసులతో పాటు ఒక అంగన్ వాడి ఉద్యోగిని విధుల నుండి తొలిగించామన్నారు.

డిసెంబర్ 2022 నాటికి అన్ని జిల్లాలలో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతకు అమలు చేస్తున్న పధకాల ద్వారా నిరుపేదలైన లబ్ది దారులకు అందుతున్న ప్రయోజనాలను సమీక్షించనున్నామన్నారు. ఆహార భద్రతకు సంబంధిత పథకాలైన ప్రజాపంపిణీ వ్యవస్థ, మహిళా, శిశు అభివృద్ధి సంస్థ అమలు చేస్తున్న పధకాలు, మధ్యాహ్న భోజన పధకం, సంక్షేమ హాస్టర్ విద్యార్థులకు భోజన, వసతులు, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పధకం అమలుపై కమిషన్ అన్ని జిల్లాల్లోనూ సమీక్షించి తగు చర్యలు తీసుకుంటుందన్నారు.

ఈ పథకాలకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు ఉన్నా సవరించడం, సంబంధిత అధికారులను అప్రమత్తం చేయడం, తప్పులు ఎక్కువగా ఉన్నచో సుమోటోగా తీసుకుని కేసులు పెట్టడం, జరిమానా విధించడం, అవకతవకలకు పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు సిఫారసు చేయడం ఆహార కమిషన్ ముఖ్యమైన విధి విధానాలని చైర్మన్ విజయ ప్రతాప రెడ్డి పేర్కొన్నారు.

AP-FOOD-COMMISSION

ఆహార భద్రతకు సంబంధించిన సమస్యలను గానీ, జరుగుతున్న అవకతవకలు గానీ కమిషన్ దృష్టికి తీసుకు రావచ్చునని చైర్మన్ అన్నారు. ఫిర్యాదులు పంపే వారు వాట్సాప్ నెంబరు 9490551117 కు పంపించాలని, ఫోన్ చేసి ఫిర్యాదు చేయగోరేవారు టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2388 నకుగానీ ఫోన్ చేసి తెలియజేయవచ్చునన్నారు.

ఈ మెయిల్ apstatefoodcommission@gmail.com కు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ సభ్యులు బక్కముంతల కాంతారావు, లక్ష్మీరెడ్డి ఇండేలా, జక్కంపూడి కిరణ్ లు, ఫుడ్ కమిషన్ మెంబెర్ సెక్రటరీ ఎమ్. సునీత, ఉపసంచాలకులు పి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.