Thu. Mar 28th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమ‌ల‌,మే 28,2022: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ లాంటి పర్వదినాల కంటే ఎక్కువ మంది భక్తులు విచ్చేశారు. దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి ఆలయంలో గంటకు 4,500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం చేయించేందుకు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేయడమైనది. ఇటువంటి అనూహ్యమైన రద్దీ సమయంలో విఐపిలు కూడా తిరుమల యాత్ర విషయం పునరాలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని టిటిడి కోరుతోంది.

భక్తుల క్యూలైన్ల తనిఖీ

టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి శనివారం సాయంత్రం తిరుమలలో భక్తులు వేచి ఉన్న క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నామని ఈఓ తెలిపారు. పోలీసులు, విజిలెన్స్, టిటిడిలోని అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలియజేశారు.