365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఏప్రిల్ 19,2023: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ICAR- అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (అటారి) హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో రెండు రోజుల వర్క్ షాప్ రాజేంద్రనగర్ లోని విస్తరణ విద్యా సంస్థ (EEI) లో ఈరోజు ప్రారంభమైంది.
2023-24 సంవత్సరానికి తెలంగాణలోని 16 కృషి విజ్ఞాన కేంద్రాలు(KVK) అనుసరించాల్సిన వార్షిక కార్యాచరణ ప్రణాళికను దీనిలో చర్చించి ఆమోదిస్తారు. ఈ వర్క్ షాప్ లో రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన, పశు విశ్వవిద్యాలయాల అధికారులు, 16 KVK ల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో పరిశోధన, విస్తరణ విభాగాలు చాలా ముఖ్యమైనవని PJTSAU విస్తరణ సంచాలకులు డాక్టర్ వి. సుధారాణి అన్నారు.

వాతావరణ మార్పులు, నూతన టెక్నాలజీల విషయంలో రైతుల్లో విస్తృత అవగాహన కల్పించడానికి KVK లు కృషి చేయాలని సూచించారు. విలువ జోడింపు, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ పద్ధతులు, రైతు ఉత్పత్తి సంఘాలు వంటి విషయాలపై రైతుల్ని చైతన్యవంతుల్ని చేయాలని KVK శాస్త్రవేత్తలకి సుధారాణి సూచించారు.
రైతులు పెట్టుబడి వ్యయం తగ్గించుకొని, అధిక ఉత్పత్తి ఉత్పాదతలు సాధించడానికి అవసరమైన మెళకువల్ని నేర్పించడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు దృష్టి పెట్టాలని PJTSAU పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం. వెంకటరమణ అభిప్రాయపడ్డారు.
పురుగుమందులు, ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించడానికి, రైతులు ఆదాయం పెంపొందించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని వెంకటరమణ అన్నారు.
మారుతున్న కాలంలో వ్యవసాయంలో డిజిటలీకరణ ప్రాముఖ్యాన్ని రైతుల ముంగిటకు తీసుకెళ్లాలని అటారి (Zone- ఎక్స్) డైరెక్టర్ డాక్టర్ షేక్ N.మీరా KVK శాస్త్రవేత్తలకి సూచించారు. నవకల్పనలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా రైతాంగాన్ని సమాయత్తం చేయాలన్నారు.
అధునాతన ప్రసార, ప్రచార మాధ్యమాల్ని విస్తృతంగా వినియోగించుకోవాలని షేక్. N. మీరా అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ RK సమంత మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రాలను మిని అగ్రికల్చరల్ యూనివర్సిటీలుగా మార్చేందుకు కృషి చేయాలని అన్నారు.

రైతులకు నూతన వ్యవసాయ పరిజ్ఞానం అందించేందుకు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. PJTSAU అధికారులు డాక్టర్ సీమ, అనిత, రత్నకుమారి, జమునా రాణి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ టెన్షన్ డాక్టర్ సి. పద్మవేణి, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ A. కిరణ్ కుమార్, PV నరసింహారావు తెలంగాణ పశు విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ M. మహేందర్ తదితరులు పాల్గొన్నారు.