వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో టీటీడీ కి చోటు

AP News Devotional Featured Posts Trending ttd news
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల 13 నవంబర్ 2021: ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు గాను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంగ్లాండ్ కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. శనివారం తిరుమలలో టిటిడి పాలకమండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డికి ఆ సంస్థ భారత దేశ అధ్యక్ష్యులు సంతోష్ శుక్ల తరపున దక్షిణ భారత దేశ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఈ సర్టిఫికెట్ అందజేశారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు,సదుపాయాలు అందిస్తోందన్నారు .సాధారణ రోజుల్లో తిరుమలలో 60 నుంచి 70 వేల మంది భక్తులకు చిన్న పాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలోజరుగుతోందని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. రోజుకు మూడున్నర లక్షలకు పైగా లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారుచేసి భక్తులకు అందించడం జరుగుతోందన్నారు. కళ్యాణ కట్టలో రోజుకు 35 వేల నుంచి 45 వేల మంది భక్తులు చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటున్నారని ఆయన తెలిపారు.

ఇంత మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా విజిలెన్స్ మరియు సెక్యూరిటీ విభాగం సేవలు అందిస్తోందని చెప్పారు. ప్రతి రోజు వేలాది మంది భక్తులు అన్న ప్రసాదం లో పరిశుభ్రమైన వాతావరణం మధ్య స్వామివారి అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారని సుబ్బా రెడ్డి చెప్పారు. రోజు ఇన్ని లక్షల మంది విచ్చేస్తున్న తిరుమల క్షేత్రం పరిశుభ్రత, పచ్చదనానికి పెద్ద పీట వేస్తోందని చెప్పారు. ప్రపంచంలో ఇతర ఏ ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన బుక్కులో తిరుమలకు చోటు కల్పించిందని ఆయన చెప్పారు.