Fri. Mar 29th, 2024
thallapatra

365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి,జూలై17,2022: తిరుపతిలో టీటీడీ నిర్మిస్తున్న చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాల నిర్మాణాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. విలువైన విజ్ఞానం దాగివున్న మాను స్క్రిప్ట్స్‌ను (చేతి రాత‌ల ప్ర‌తులు) చక్కగా స్కాన్ చేసి భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని చెప్పారు.

thallapatra

తాడేపల్లిలోని తన కార్యాలయం నుంచి శనివారం ఆయన టీటీడీలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌ రెడ్డి మాట్లాడుతూ, స్విమ్స్ లో క్యాన్సర్ యూనిట్ లోని ఈ, ఎఫ్‌ బ్లాక్ ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, అవసరమైన పరికరాల కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలన్నారు. బర్డ్ ఆస్పత్రి సమాచారం, ఓపి ఇతర వివరా లన్నింటితో కలిపి మొబైల్ యాప్ తయారు చేయాలన్నారు. బర్డ్ లో కొత్తగా 100 పడకలు అందుబాటులోకి తేవడానికి తగిన ఏర్పాటు చేయాలన్నారు. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో ఈ నెలాఖరులోపు నూతన యంత్రాలను పూర్తిగా ఏర్పాటు చేసి అక్టోబర్ నుంచి 266 రకాల కొత్త మందుల తయారీకి త‌గు అనుమ‌తుల‌తో చర్యలు తీసుకోవాలన్నారు.

తిరుమలలో మ్యూజియం అభివృద్ధి, అంజనాద్రి, వెంగమాంబ ధ్యాన మందిరం, ఘాట్ రోడ్ల‌లో కొండ చరియ‌లు విరిగిపడకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, ఈ- ఎం బుక్‌ అంశాలపై ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్షించారు. అలాగే తిరుమలలో విద్యుత్తు పొదుపు కోసం మీటర్ల ఏర్పాటు తదిత‌ర‌ అంశాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. తిరుప‌తిలోని టీటీడీ పరిపాలన భవనం ఆధునీకరణలో భాగంగా వర్క్ స్టేషన్స్, ప్రధాన ద్వారం ఎలివేషన్ అత్యద్భుతంగా వచ్చేలా వైకుంఠ ఏకాదశి నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. జమ్మూ, చెన్నైలో నిర్మిస్తున్న ఆలయాల నిర్మాణ పనులపై ఆయన సమీక్షించారు. గో శాలలో నిర్మిస్తున్న‌ ఫీడ్ మిక్సింగ్ ప్లాంటు, నెయ్యి త‌యారీ ప్లాంట్‌, గోశాల నిర్వహణ, దేశీయ గో జాతుల పిండోత్పత్తి విషయాలపై స‌మీక్షించారు.

thallapatra

టిటిడి విద్యాలయాలకు సంబంధించి న్యాక్‌ గుర్తింపు, విద్యార్థుల వివరాలతో అప్లికేషన్ రూపొందించాల‌న్నారు. తిరుమల శేషాచ‌లం అట‌వీ ప్రాంతంలో అకేషియా చెట్ల తొలగింపునకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 28 నోడల్ గోశాలల నిర్వాహకులకు శిక్షణ గురించి అధికారులతో చర్చించారు. అదివో అల్లదివో కార్యక్రమం ఫైనల్ పోటీలను ఆగస్టు నెలలో పూర్తి చేయాలన్నారు. వేదాల సారాన్ని ప్రజలకు అందించేలా ఎస్వీబిసి కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌న్నారు. అలిపిరిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవ‌స‌ర‌మైన నియ‌మావ‌ళిని సిద్ధం చేయాల‌న్నారు.

thallapatra

జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎఫ్ ఎసిఎవో బాలాజి, ఎస్వీబిసి సీఈవో షణ్ముఖ కుమార్, సిఎవో శేష శైలేంద్రతో పాటు పలువురు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.