Thu. Apr 25th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తెలంగాణ,నవంబర్ 27,2021: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ నెల 30న బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణీకులకు రవాణా సేవలు అందిస్తున్న సంస్థ మరో ముందడుగు వేసి రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టింది. సిబ్బంది నుంచి అధికారుల వరకు, స్నేహితుల నుంచి కుటుంబ సభ్యుల వరకు ఎవరైనా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ప్రహరీ ట్రస్టు సహకారంతో టి.ఎస్. ఆర్టీసీ ఈ నెల 30న ఉదయం 9 నుంచి
మద్యాహ్నం ఒంటిగంట వరకు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనుంది.

అన్ని రీజియన్ల నుంచి 65 చోట్ల ఈ శిబిరాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం ఆరోగ్యవంతులైన
ఉద్యోగులందరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛైర్మన్ శ్రీ సజ్జనార్ కోరారు.తలసేమియా, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, గర్భిణీ మహిళల కోసం రక్త సేకరణ కార్యక్రమాన్ని అన్ని డిపోలు, వర్క్ షాప్స్, బస్ భవన్ తో పాటు బస్ స్టేషన్లలో కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడగలిగే అవకాశం కేవలం రక్తదానంతో మాత్రమే సాధ్యమవుతుందన్నారు.సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వారు ఎవరైనా సంవత్సరం లో రెండు లేదా మూడు పర్యాయాలు రక్తదానం చేయవచ్చని, రక్తదానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయని సూచించారు.రక్తదానం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయనే అపోహలు విడనాడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు.

టి.ఎస్. ఆర్టీసీ రక్తదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తలపెట్టడం పట్ల సంస్థ అధ్యక్షులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరినీ చైతన్య పరిచి ఎక్కువ మంది రక్తదానం చేసే విధంగా అవగాహన కార్యక్రమాలుచేపట్టవలసిన
అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిబ్బంది, ఉద్యోగులను సన్నద్ధం చేస్తున్న సంస్థ ఎం.డి సజ్జనార్కు ప్రత్యేకంగా ఆయన అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి సంస్థను అదర్శంగా నిలపాలని కోరారు. రెడ్ క్రాస్ సొసైటీ (హైదరాబాద్) ప్రతినిధి మామిడి భీంరెడ్డి, ప్రహరీ ట్రస్టు వ్యవస్థావకులు వై.రఘు రామారావులను కూడా ప్రశంసించారు.