Thu. Apr 18th, 2024
horticultural university graduation__ceremony

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 23, 2022: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణా రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవ సంబరాలకు సిద్ధమైంది.

సిద్దిపేట జిల్లా ములుగులోని యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో
నేడు స్నాతకోత్సవం జరుగనుంది.

ఈ విశ్వవిద్యాలయం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక విజయాలను సాధించింది. భారతదేశంలోని వ్యవసాయ, అనుబంధ రంగాలలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య విశ్వవిద్యాలయాల్లో దేశం మొత్తంలో శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి మహిళ ను మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గా నియమించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకే దక్కుతుంది.

వైస్ ఛాన్సలర్ గా డాక్టర్ బి.నీరజ ప్రభాకర్ సేవలందిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం విద్య, పరిశోధన, విస్తరణలో గత ఎనిమిదేళ్లలో అనేక విజయాలు సాధించింది.

horticultural university graduation__ceremony

సాధించిన విజయాలు..

శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, అలాగే వర్సిటీ పరిధిలోని రాజేంద్రనగర్, మోజెర్ల కళాశాలలో లోని అండర్ గ్రాడ్యుయేట్, M.Sc , Ph.D ప్రోగ్రాంలలో దేశంలోని ప్రతిష్టాత్మక భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) అక్రిడిటేషన్ సాధించింది. 2021 మార్చ్ 28 నుండి 2026 మార్చ్ 27 వరకు ఈ అక్రిడిటేషన్ గుర్తింపు ఉండనుంది.

విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలలో చదివిన విద్యార్థులు 66 జె ఆర్ఎఫ్సీట్లు, ఏడు ఎస్ఆర్ఎఫ్ సీట్లు పొందారు.

అదేవిధంగా 2021 సంవత్సరంలో మొత్తం 31మంది విద్యార్థులు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందగా, ఎనిమిది జెఆర్ఎఫ్ లు, 23 నాన్ జెఆర్ఎఫ్ సీట్లు సాధించారు.

అలాగే 2022 సంవత్సరానికి గాను ఎనిమిది ఎస్ఆర్ఎఫ్ లు, 23 జేఆర్ఎఫ్ సీట్లు వర్సిటీ విద్యార్థులు సాధించారు.

వర్సిటీ చట్ట సవరణ ద్వారా అటవీ కళాశాల, పరిశోధన సంస్థకు, అలాగే హార్టీకల్చర్ పాలిటెక్నిక్ లకు అఫిలియేషన్ ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలో నాణ్యతను పెంచేందుకు గాను 2022-23 విద్యా సంవత్సరం నుంచి ములుగులోని వర్సిటీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో “పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ సైన్సెస్” ను ఏర్పాటు చేయనుంది.

ఆదిలాబాద్ లోని హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది.


హైబ్రిడ్ రకం అభివృద్ధి..

వరంగల్ జిల్లాలో మిరప, విత్తన సుగంధ ద్రవ్యాల పరిశోధన స్థానం ఏర్పాటు చేయడానికి ఇప్పటికే నివేదిక సమర్పించడం జరిగింది.

ఉద్యాన పంటల్లో కేంద్రీయ వంగడాల విడుదల కమిటీ తన 28వ సమావేశంలో ARI 516 (H 516/MACS 516) అనే మొదటి ద్రాక్ష రకాన్ని ICAR-AICRP ద్వారా విడుదలకు, నోటిఫికేషన్ కు సిఫార్సు చేసింది.

ARI 516 అనే రకం తెలంగాణలో ప్రాసెసింగ్ పరిశ్రమకు అనువైన జ్యూస్ రకం. వైటిస్ లాబ్రుష్క, వైటిస్ వినిఫెరా అనే రెండు జాతుల బ్రీడింగ్ ద్వారా ఈ హైబ్రిడ్ రకాన్ని అభివృద్ధి చేశారు.

horticultural university graduation__ceremony

చపాట మిరపకు భౌగోళిక గుర్తింపు కోసం విశ్వవిద్యాలయం నివేదిక సమర్పించింది. పనసలో నూతన క్లోన్ లు, అలాగే టమాట, బేల్ జర్మప్లాజంకు యాక్సెషన్ నెంబర్లను తీసుకోవడం జరిగింది.

మామిడిలో ఫర్టిగేషన్ టెక్నాలజీ, జామలో సమగ్ర పురుగు, పోషక యాజమాన్యం పద్ధతులను ప్రమాణీకరించటం జరిగింది.

మామిడి, జామ లలో సేంద్రియ ఉత్పత్తికి విధానాలను ప్రమాణీకరించడం జరిగింది.

పసుపులో తక్కువ ఖర్చులో విత్తనం నాటే విధానం, సేంద్రీయ ఉత్పత్తులు, విలువల జోడింపు అంశాల్లో ప్రమాణీకరించడం జరిగింది.

క్యాబేజ్, లెట్యూస్, బ్రకోలీ లలో రక్షిత సేద్యంలో ఫర్టిగేషన్ షెడ్యూల్ ను ప్రామాణికరించడం, అలాగే వంకాయలో కొమ్మ, కాయ తొలుచు పురుగు; టమాటాలో సూది పురుగు లకు సమగ్ర పురుగు యాజమాన్య పద్ధతులను ప్రమాణీకరించారు.

కాయగూర పంటల్లో పెరటి, మిద్దె తోటలు, పామాయిల్ తోటల యాజమాన్యం, అలాగే ల్యాండ్ స్కేప్ యాజమాన్యంలో స్వల్పకాలిక సర్టిఫికెట్ శిక్షణ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టింది.

రామగిరి ఖల్లాలోని హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో పామ్ ఆయిల్ లో నాటే పద్ధతులు, అంతర పంటలపై విశ్వవిద్యాలయం పరిశోధనలు ప్రారంభించింది.

“జాతీయ స్థాయి కృషి కర్షక్ ఇన్స్పైరింగ్ లీడర్ షిప్ అవార్డు”..

తెలంగాణ రాష్ట్ర ఉద్యాన ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో రామగిరిఖిల్లా “కృషి విజ్ఞాన కేంద్రం” రైతు సమాజానికి చేస్తున్న సాంకేతికత బదిలీ సేవల గుర్తింపు గాను భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి నుంచి “జాతీయ స్థాయి కృషి కర్షక్ ఇన్స్పైరింగ్ లీడర్ షిప్ అవార్డు” ను సొంతం చేసుకుంది.

అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రెసివ్ రైతు ఈ. రామ కంఠారావు సేంద్రీయ సాగులో చేస్తున్న సేవలకు గుర్తింపును 2022లో రగోత్తం రెడ్డి మెమోరియల్ లెక్చర్ లో ” హార్టికల్చర్ సెక్టార్ లో ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అవార్డ్” అందుకున్నారు.

కెవికె దత్తత గ్రామాలైన “మంథని మండలంలోని నాగారం, అలాగే ముత్తారం మండలంలోని హరిపురం లకు 202021 గాను “దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరన్ పురస్కార్” అవార్డు లభించాయి.

2020-21 సంవత్సరానికి గాను ” ఉత్తమ సంవత్సర నివేదిక- 2020, బెస్ట్ ప్రోగ్రాం: స్వచ్ఛత సేవ-2020; సిఎల్ఎఫ్ డి అపరాలలో బెస్ట్ ప్రాజెక్ట్స్- 2020 అనే మూడు అప్రిసియేషన్ అవార్డులను రామగిరిఖిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం 2020-21 సంవత్సరానికి గాను ఐసిఏఆర్- అటారి జోన్ సిక్స్త్, యాన్యువల్ జోనల్ వర్క్ షాప్ లో అందుకుంది.

2022 సంవత్సరంలో కృషి విజ్ఞాన కేంద్రం, డిఆర్డిఓ- సెర్ప్, గ్రామ పంచాయతీ సహకారంతో మంథని మండలంలోని నాగారం గ్రామంలో మిల్లెట్ యూనిట్ ను స్థాపించింది. బిస్కెట్లు, బేకరీ ఉత్పత్తులు, తృణధాన్యాలలో విలువల జోడింపుల ద్వారా ఇక్కడ ఉత్పత్తి చేస్తారు.

ఉద్యాన దిక్సూచి..

horticultural university graduation__ceremony

నేల ఎంపిక, మేలైన విత్తన వంగడాల ఎంపిక మొదలుకొని సాగునీరు, చీడపీడల యాజమాన్యం, పోషక యాజమాన్యాలతో సహా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక సమాచారాన్ని పొందుపరిచి “ఉద్యాన దిక్సూచి” పేరుతో ఉద్యాన రైతులకు తక్కువ ధరకే సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించి అందిస్తుంది విశ్వవిద్యాలయం.

విశ్వవిద్యాలయం దాదాపు 25 జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, శాస్త్రీయ సంస్థలతో అవగాహన ఒప్పందం (MoU) చేసుకుంది.

2022 సెప్టెంబర్ 27 న శ్రీ కొండా లక్ష్మణ్ 107వ జయంతి సందర్భంగా విద్యాలయం వెబ్సైట్ లాంచ్ చేయడంతో పాటు, రాజేంద్రనగర్ లోని ఉద్యాన కళాశాలలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

హైదరాబాదులోని హార్ట్ ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో 2022 సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 2వ తేది వరకు “భారత వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఉప-కులపతుల సమావేశాన్ని” విశ్వవిద్యాలయం నిర్వహించింది.

ఈ సమావేశంలో నూతన విద్యా విధానం-2020 విషయాల స్వావలంబన దిశగా చేపట్టే విధానాలపై చర్చ జరిగింది.

స్నాతకోత్సవంలో చీఫ్ గెస్ట్ గా గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర్ రాజన్..

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఛాన్స్లర్ డాక్టర్ (శ్రీమతి) తమిళ సై సౌందర్ రాజన్ స్నాతకోత్సవానికి డిస్టింగ్విస్డ్ చీఫ్ గెస్ట్ గా, భారత వ్యవసాయ పరిశోధన మండలి హార్టికల్చరల్ సైన్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆనంద్ కుమార్ సింగ్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు.

మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్..

horticultural university graduation__ceremony

విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవంలో మొత్తం 575 డిగ్రీ పట్టాలు ఇవ్వనుండగా, అందులో 482 అండర్ గ్రాడ్యుయేట్, 76 పోస్ట్ గ్రాడ్యుయేట్, 17 పీహెచ్.డి పట్టాలు విద్యార్థులకు అందజేయనున్నారు.

అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లో 3బ్యాచ్ లకు 3 యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్, అలాగే PG లో 2 బ్యాచులకు 2 యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్, అలాగే PG లో మరో ఆరు స్పాన్సర్ గోల్డ్ మెడల్ లు కలిపి మొత్తంగా 11 బంగారు పతకాలు అత్యధిక ఓ జి పి ఏ సాధించిన విద్యార్థులకు గవర్నర్ అందించనున్నారు.