Fri. Mar 29th, 2024
mother-and-daughter-busines

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,అక్టోబర్ 26,2022: బతకాలంటే ఉపాధి కావాలి.. ఉపాధి పొందాలంటే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ తప్పనిసరి. బిజినెస్ చేయాలంటే అందుకోసం సరైన ఐడియా ఉండాలి.. ఆ ఒక్క ఆలోచనే జీవితాలను మార్చేస్తుంది. ఓ గృహిణి 49ఏళ్ల వయసులో వినూత్న ఆలోచనతో అనతి కాలంలోనే లక్షలు సంపాదిస్తోంది. ఏదైనా సాధించడానికి ఎవరో రావాలి.. ఏదో చెయ్యాలి.. అని ఎదురు చూడకుండా తనకు వచ్చిన ఐడియాతో నెలకు నాలుగున్నర లక్షలు పైగా సంపాదిస్తూ తన సత్తా నిరూపిస్తోంది.

mother-and-daughter-busines

రాజస్థాన్ లోని జైపూర్‌కు చెందిన రీతూ భన్సాలీ ఆమె కుమార్తెలు దివా ,దియా బన్సాలీలతో కలిసి సరికొత్త బిజినెస్ మొదలు పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తమ బ్రాండ్ ‘ఎవ్రీథింగ్ మామ్ మేడ్’ ద్వారా ఇంట్లో తయారుచేసిన జుట్టు, చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నారు. అనతి కాలంలోనే లక్షలు సంపాదిస్తున్నారు. గత 28 ఏళ్లుగా హౌజ్ వైఫ్ గా కొనసాగుతున్న రీతూ బన్సాలీ పారిశ్రామికవేత్త అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు.

49ఏళ్ల వయసులో ఆమె తన కుమార్తెలు దివా,దియాలతో కలిసి సహజసిద్ధమైన రసాయనాలు లేని ఉత్పత్తులను విక్రయాలు చేస్తోంది. 2020 ఆగస్టు లో ‘ఎవ్రీథింగ్ మామ్ మేడ్’ బ్రాండ్ ద్వారా జుట్టు, చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వ్యాపారాన్నిరీతు ప్రారంభించింది.

mother-and-daughter-busines

చర్మ, జుట్టు సంబంధిత సమస్యలకు సరైన పరిష్కారాలు అందించాలని ఆలోచనచేసింది రీతూ. అందుకోసం మార్కెట్ లో లభించే ఉత్పత్తులను పరిశీలించింది. ఆమె పరిశీలనలో మార్కెట్ లో ఉన్న ఉత్పత్తులన్నీ రసాయనాలతో కూడిన వని తేలింది. దీంతో వినియోగదారులకు ఎటువంటి రసాయనాలు లేకుండా, సహజ సిద్ధంగా లభించే వాటితో ఆయా ఉత్పత్తులను తయారు చేయాలనుకుంది. ఈ ఆలోచనను అమలు చేసింది. అలా తన వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది.

వ్యాపారం ఎంత పెట్టుబడితో ప్రారంభించింది..? కేవలం రూ.21,000 పెట్టుబడితో ప్రారంభమైన ఈ వ్యాపారంతో తల్లీకూతుళ్లు ప్రస్తుతం నెలకు రూ.4.5 లక్షలు సంపాదిస్తున్నారు. తన కుమార్తెల ప్రోత్సాహంతో రీతూ జుట్టు,చర్మ సంరక్షణ కోసం సహజసిద్ధమైన ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టింది. ఆమె రూపొందించిన ప్రోడక్ట్స్ ను మొదట వారి బంధువులు, స్నేహితులకు అందించింది. అనంతరం వారు ఆమె తయారుచేసిన ఉత్పత్తులను వినియోగించి రీతును అభినందించడమే కాకుండా ప్రోత్సహించడం మొదలు పెట్టారు.

mother-and-daughter-busines

రీతూ రూపొందించిన ప్రోడక్ట్స్ కు రోజురోజుకూ మరింతగా డిమాండ్ పెరిగింది. దీంతో ఆమె ఇద్దరు కూతుళ్లు సైతం ఇదే వ్యాపారంలోకి దిగారు. దివా ఢిల్లీలో ఫ్రీలాన్స్ పీఆర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నది. ఆమె ‘ఎవ్రీథింగ్ హోమ్ మేడ్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ పేజీని ప్రారంభించారు. ఆ పేజీలో ఆహారం, ఆరోగ్య చిట్కాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత వీరి బిజినెస్ మొదలు పెట్టాక ఇన్‌స్టాగ్రామ్ పేజీ పేరును ‘ఎవ్రీథింగ్ మామ్ మేడ్’గా మార్చారు.

రీతూ కూతుళ్లు ఈ పేజీలో కొన్ని ఉత్పత్తుల జాబితాను పోస్ట్ చేశారు. దీంతో విపరీతంగా ఆర్డర్‌లు వచ్చాయి. ఇక అక్కడి నుంచి వీరి వ్యాపారం మరింతగా పెరిగింది. తమ ఆలోచనతో ఇంట్లోనే చిన్న వ్యాపారం మొదలుపెట్టి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెలకు నాలుగున్నర లక్షలు సంపాదిస్తున్నారు ఈ తల్లీకూతుళ్లు. పలువురు మహిళలకు వీళ్ళు ఆదర్శంగా నిలుస్తున్నారు.