Sat. Apr 20th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 9,2023: ‘ది కేరళ స్టోరీ’ దర్శకుడు సుదీప్తో సేన్ తన సినిమాలోని సహనటుడికి బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ది కేరళ స్టోరీ’ చిత్ర బృందం సభ్యులకు బెదిరింపులు వస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు రావద్దని సిబ్బందిని హెచ్చరించారు.

దీంతో చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం సిబ్బందికి పోలీసులు భద్రత కల్పించారు. ఈ సినిమా విడుదలకు ముందే వివాదం తలెత్తడమేకాకుండా చాలా చోట్ల బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ‘ది కేరళ స్టోరీ’ చిత్ర బృందం టీమ్ కు తెలియని నంబర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ‘ది కేరళ స్టోరీ’ చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్, సిబ్బందిలో ఒకరికి తెలియని నంబర్ నుంచి టెక్స్ట్ మెసేజ్ వచ్చిందని చెప్పారు. ఒంటరిగా ఇంటి నుంచి బయటకు రావద్దని మెసేజ్‌లో బెదిరించారని పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు చిత్ర బృందం సభ్యులకు భద్రత కల్పించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.

మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మే 8న ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని నిషేధించింది. ‘శాంతిని కాపాడటం’ రాష్ట్రంలో ‘ద్వేషం ,హింస’ సంఘటనలను నివారించడం కోసం ఈ సినిమాను బ్యాన్ చేశారు.

సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారం అని అన్నారు. ‘కేరళ స్టోరీ’లో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించారు. దీని ట్రైలర్‌లో కేరళకు చెందిన 32,000 మంది మహిళలు తప్పిపోయి ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరారని పేర్కొంది.

ఇది జరిగిన వెంటనే సినిమాకు సంబంధించి వివాదం చెలరేగింది. అయితే, నిరసనల కారణంగా, ట్రైలర్ నుంచి అనేక అంశాలు తొలగించారు. దీని ట్రైలర్ తర్వాత కేరళకు చెందిన ముగ్గురు మహిళల కథగా మార్చారు. అయితే ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.