TTD | 14రకాల పుష్పాలు, 6రకాల పత్రాలతో శ్రీవారికి పుష్పయాగం..

AP News Devotional Featured Posts National Top Stories Trending ttd news
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల, న‌వంబ‌రు 12,2021 : పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకుల వల్లగానీ, ఉద్యోగుల వల్లగానీ, భక్తుల వల్లగానీ జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు.

శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మధ్యాహ్నం 1 గంట‌ నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రా భరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు.

చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.