Wed. May 31st, 2023
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 12, 2021: బీడుపడ్డ తెలంగాణ పచ్చవడాలె.. అన్నదాత దేనికోసం ఆరాటపడకుండా.. గుండెలమీద చెయ్యేసుకొని ఎవుసం చేసుకోవాలె. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి సంకల్పం. అందులోంచి ఆవిష్కారమైంది రైతుబంధు. అవినీతి లేదు.. హెచ్చుతగ్గులు లేవు.. గుంట జాగున్నా.. పదులకొద్దీ ఎకరాలున్నా భేదం లేదు. నిఘా నిగరానీల్లేనే లేవు. ఎకరానికి ఐదు వేలు.. ఏడాదికి రెండు కార్లు.. నేరుగా రైతుల ఖాతాల్లో జమ. దఫ్తర్‌ లేదు.. దరఖాస్తు లేదు. ఒక్కసారి నమోదు చేసుకొంటే చాలు. ఇంకేం ఆలోచించక్కర్లేదు. నాట్లు మొదలయ్యే నాటికి ఠంచన్‌గా పైసలొచ్చి ఖాతాల్లో పడిపోతాయి. ఇప్పటికి ఏడు విడుతలైపోయాయి.

ఎనిమిదో విడుత సాయం పంపిణీ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పంపిణీతో రైతుబంధు సాయం మొత్తంగా రూ.50 వేల మార్కును దాటిపోనున్నది. రైతుకు పంట సమయంలో పెట్టుబడి అనేది చాలా కీలకం. దాని కోసం చిన్న, సన్నకారు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం.. అప్పు, దానిమీద పడే మిత్తి పులిమీద పుట్రలా ఒకదానికి ఒకటి తోడై రైతును పూర్తిగా కృంగదీసే దుస్థితి. ఈ క్షోభ నుంచి రైతును కాపాడటం కోసం పంటకు అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వమే సమకూర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించి రైతులపక్షాన నిలిచారు. అంత గొప్ప నిర్ణయాన్ని స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఏ ప్రభుత్వమూ తీసుకోలేదు. అందులో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 2018 మే 10న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్‌ వద్ద రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టారు.

తొలుత 2018-19 సంవత్సరం నుంచి ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటలకోసం రెండు విడతల్లో ప్రతి రైతుకు మొత్తం ఏడాదికి రూ. 8వేలను ప్రభుత్వం అందించడం ప్రారంభించారు. పునాస పంట పెట్టుబడిని ఏప్రిల్‌ నుంచి, యాసంగి పంట పెట్టుబడిని నవంబర్‌ నుంచి పంపిణీ చేశారు. 2019-20 నుంచి పంట పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచింది ప్రభుత్వం. దీంతో రైతుకు ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేలు అందుతుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.43 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమచేసింది. ప్రస్తుతం ఈ యాసంగికి పెట్టుబడిని విడుదల చేయాల్సి ఉంది. ఈ సారి రైతులతోపాటు, సాగువిస్తీర్ణం కూడా పెరగనుందని తెలుస్తున్నది. అందుకు రూ.7,500కోట్లు అవసరమని అంచనా వేసింది. ఆ నిధులు త్వరలోనే విడుదల కానున్నాయి. దీంతో రైతుబంధు పథకం రూ. 50 వేల కోట్ల మైలురాయిని దాటిపోనున్నది. పంట పెట్టుబడి పథకం వల్ల 90.5 శాతం ఉన్నపేద రైతులు లబ్ధి పొందారు.

ప్రపంచ దేశాల్లో ఎక్కడాలేని పథకం ఇది..

దేశంలో ఏ ఒక్క ప్రధానీ ఆలోచించలేదు.. అన్నం పెడుతున్న రైతుకు ఏమైనా చేద్దామని.. ఏ ముఖ్యమంత్రీ కనీసం దృష్టిపెట్టలేదు.. అన్నదాతలను కడుపులో పెట్టుకొని కాచుకోవాలని.. కానీ తెలంగాణలో ఒకే ఒక్క నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కలగన్నారు.. కడుపు నింపుతున్న కర్షకుడిని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని.. అందులోంచి పుట్టిందే రైతుబంధు. ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఏ దేశంలోనూ ఇప్పటివరకు అమలులో లేదు. ఏ ఒక్క పాలకుడి ఆలోచనకూ తట్టని పథకం. ఈ పథకాన్ని యావత్‌ భారతదేశమే కాదు ఏకంగా ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసించింది. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ తరహా సాయం చేయడంలో రైతుబంధును మించిన పథకం మరొకటి లేదని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ లాంటివారే కొనియాడారు.