Fri. Apr 19th, 2024
Telangana government takes strict action on Ibrahimpatnam family planning operations incident

మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు

రంగారెడ్డి డిఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మి, డీసీహెచ్ఎస్ ఝాన్సీలక్ష్మిలపై బదిలీ వేటు

ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార్ పై క్రిమినల్ కేసు నమోదు

బాధ్యులపై చర్యలతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా మార్గదర్శకాలు

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ వైద్యారోగ్య శాఖ

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,సెప్టెంబర్ 24,2022: గత నెల 25వ తేదీన ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల (DPL క్యాంపు) ఘటన పై తెలంగాణ సర్కారు కఠినచర్యలు తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్వర్యంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

Telangana government takes strict action on Ibrahimpatnam family planning operations incident

రంగారెడ్డి డిఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్లపై బదిలీ వేటు వేసింది. వీరిని కలుపుకొని మొత్తం 13 మంది వైద్య సిబ్బందిపై క్రమ శిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి సంబంధించిన DPL క్యాంపు ఆఫీసర్ డాక్టర్ నాగజ్యోతి,డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ గీత, హెడ్ నర్స్ చంద్రకళతో పాటు, మాడుగుల్ PHC డాక్టర్ శ్రీనివాస్, సూపర్ వైజర్లు అలివేలు, మంగమ్మ, మంచాల్ PHC డాక్టర్ కిరణ్, సూపర్ వైజర్ జయలత, దండుమైలారం PHC డాక్టర్ పూనం, సూపర్ వైజర్ జానకమ్మ ఉన్నారు.

జిల్లా ఆసుపత్రుల వైద్య సేవల కోర్డినేటర్ (డీసీహెచ్ఎస్) ఝాన్సీ లక్ష్మిని బదిలీ చేసిన ఆరోగ్యశాఖ, షాద్ నగర్ ఆసుపత్రిలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆమెపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరదాచారికి రంగారెడ్డి డీసీహెచ్ఎస్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే సస్పెండ్ అయిన ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, మారో వైపు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిర్వహణ విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని టీచింగ్ ఆసుపత్రులు, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు వీటిని పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

కుటుంబనియంత్రణ ఆపరేషన్ విషయంలో కొత్త మార్గదర్శకాలు..

Telangana government takes strict action on Ibrahimpatnam family planning operations incident

1,ఆసుపత్రుల సేవల్లో భాగంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలి.
2, కు.ని ఆపరేషన్లు నిర్ణయించిన రోజులో మాత్రమే చేయాలి. ఆపరేషన్ తర్వాత 24 గంటల పాటు విధిగా అబ్జర్వేషన్ లో ఉంచాలి.
3, ముందుగా నిర్ణయించిన క్యాలెండర్ ప్రకారం, ఆపరేషన్ చేసుకునే వారు, వారికి ఇష్టం ఉన్న రోజులో రావొచ్చు.
4,డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిన పేషెంట్ ని సంబంధిత ఆసుపత్రి సూపర్ వైజర్ 24గంటల్లోగా ఒకసారి, వారంలోగా మారో రెండు సార్లు వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలి.


5, సంబంధిత పీహెచ్సి మెడికల్ ఆఫీసర్ కూడా వారి పరిధిలోని ఆపరేషన్ చేసుకున్న వారందరినీ రెండు రోజుల్లోగా వెళ్లి పరిశీలించాలి. పేషెంట్ సంబంధిత సూపర్ వైజర్ పేషెంట్లను మానిటర్ చేస్తున్నారా లేదా మెడికల్ ఆఫీసర్ చూసుకోవాలి.
6, ప్రి ఆపరేటివ్, ఇంట్రా ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్ ప్రమాణాలు పాటించేలా ఆసుపత్రి సూపరింటెండెంట్, సర్జన్, డీపీఎల్ క్యాంపు ఆఫీసర్ చూసుకోవాలి.
7, ఆపరేషన్ల తర్వాత తలెత్తే సమస్యలను గుర్తు పట్టే విధంగా సూపర్ వైజర్లకు ఎప్పటికపుడు శిక్షణ తరగతులు నిర్వహించాలి.
8,ఏడాదికి ఒకసారి డీపీల్ సర్జన్ల నైపుణ్యతను అంచనా వేసే విధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
9, కమిషనర్ ఆఫీసు లోని రాష్ట్ర స్థాయి జాయింట్ డైరెక్టర్ మూడు నెలలకు ఒకసారి స్టెరిలైజేషన్ మీద కు.నీ నిర్వహణ అధికారులు, సర్జన్లు, ఇతర సిబ్బందితో సమీక్ష జరుపాలి.


10, నాణ్యత ప్రమాణాలను అనుసరించి ఒకరోజు ఒక ఆసుపత్రిలో 30కి మించి ఆపరేషన్లు చేయరాదు.
11, ఆయా ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న సూపరింటెండెంట్లు ప్రతి సోమవారం ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణ మీద సమీక్ష చేయాలి.
12, బోధన ఆసుపత్రులు, టీవీవీపీ ఆసుపత్రుల్లోని ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్లు, నర్సులకు ఇన్ఫెక్షన్ కంట్రోల్ నూతన పద్ధతులపై ఎప్పటికప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో శిక్షణ ఇవ్వాలి.
13, ఇన్ఫెక్షన్ నివారణ ప్రమాణాలు పాటించే విధంగా డీఎంఏఈ, టీవీవీపీ కమిషనర్ చూసుకోవాలి, ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల్లో ప్రత్యేక దృష్టి సారించాలి.