Sat. Apr 20th, 2024
SV Ranga Rao birth anniversary
SV Ranga Rao birth anniversary

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,జులై 3,2022: విశ్వవిఖ్యాత సార్వభౌమ, నవరస నటనా ధురీణ, నట గంభీర ఎస్వీ రంగారావు గారి జయంతికి శత కోటి వందనాలు. ఆయన జీవించింది కేవలం 54 ఏళ్ళు. కానీ 500 ఏళ్లకు సరిపడా కీర్తి సంపాదించగలిగారు, చనిపోయి50 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో అభిమానాన్ని సంపాదించుకున్నారు సత్కారాలు, పురస్కారాలు కాదు కళాకారునికి కావలసింది. కావలసింది ప్రేక్షకుల చప్పట్లు , అభినందనలు..ఆ విషయంలో ఎస్వీఆర్ గారిది ప్రధమ స్థానమే. అప్పుడు…ఇప్పుడు…వారు నటించని జోనర్ లేదు.

SV Ranga Rao birth anniversary

విశ్వవిఖ్యాత సార్వభౌమ ఎస్వీ రంగారావు గారి జయంతి సందర్భంగా.. ప్రత్యేక కథనం…

ఒకటా,రెండా.. పౌరాణిక, చరిత్రాత్మక, జానపద, సాంఘిక చిత్రాలలో పాత్ర ఏదైనా, చిన్నదైనా, పెద్దది అయినా పరకాయ ప్రవేశం చేసి పాత్రకు ప్రాణప్రతిష్ట చేయడం ఎస్వీఆర్ ప్రత్యేకత. గంభీరమైన విగ్రహం, దానికి తగ్గ స్వరం, సంభాషణ చతురత, నవరసాలను ప్రదర్శించే వదనం ఆయన సొత్తు. ఒకే సన్నివేశం లో భిన్న హావభావాలను క్షణ కాలం మార్చి, చూపించగల ప్రతిభ వారిది. నవ్వించడం లో ఎంత ఘటికుడో, ప్రేక్షకుల చే కన్నీరు పెట్టించే విషాదము పలికించగలడు. వారు తెలుగు గడ్డ పై పుట్టడం తెలుగు జాతి చేసుకున్న పుణ్యం. భారతదేశ ఎల్లలు దాటి విదేశంలో ప్రశంసలు అందుకొని తెలుగు జాతి కీర్తిని పెంచారు. చిరంజీవిలా ప్రేక్షకుల, అభిమానుల గుండెల్లో కొలువయ్యారు.

SV Ranga Rao birth anniversary

ఆయన నటన చూసిని మనం అదృష్టవంతులం. ఆయన నడచిన నెల మీద నడిచి మనం పునీతులము అయ్యాము. పౌరాణికాలలో వారు పోషించిన ఘటోత్కచుడు, యమధర్మరాజు, రావణబ్రహ్మ, సుయోధనుడు, కీచకుడు, హిరణ్య కశ్యపుడు, చరితాత్మక చిత్రాలలో తాండ్ర పాపయ్య, భోజరాజు, శ్రీనాధుడు జానపద చిత్రాలలో నేపాళ మాంత్రికుడు, సాంఘికలలో రంగయ్య గా తాత మనవడు, సుబ్బయ్య గా లక్ష్మీనివాసం, రంగడుగా బంగారుపాప, ఆక్షన్ చిత్రాలలో “మొనగాళ్లకు మొనగాడు”, జగత్ కిలాడీలు ఆయన కీర్తి ని ఎవరెస్టు అంత ఎత్తు పెంచింది. అసమాన నటుని స్థానంలో నిలిపాయి. మళ్లీ అలాటి నటుడు పుట్టలేదు . పుడతాడన్న నమ్మకం లేదు. మరోసారి ఆయనే పుడితే తప్ప. ఆయన స్థానం భర్తీ కాదు. ఆ మహానటుని జయంతికి నీరాజనం అర్పించడం, మనలను మనమే గౌరవించుకోవడంతో సమానం.

svr family rare pic

మహానటుడుక్లిష్టపాత్రల్లో చతురంగారావు..దుష్టపాత్రల్లో క్రూరంగారావు..హడలగొట్టే భయంకరంగారావు..హాయిగొలిపే టింగురంగారావు..రొమాన్సులో పూలరంగారావు.. నిర్మాతల కొంగుబంగారావు..స్వభావానికి ఉంగారంగారావు..కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు..కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి ఎస్వీ రంగారావు.. ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు.. ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమ కంగారంగారావు.. ఇది మహానటుడు ఎస్వీ రంగారావు ప్రతిభను గురించి, వైవిధ్యమైన పాత్రల పోషించగల నైపుణ్యం గురించి ప్రసిద్ధ దర్శకుడు చిత్రకారుడు, బాపు వేసిన చిత్రానికి ముళ్ళపూడివారి చమత్కార వ్యాఖ్యానం.

svr family rare pic

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్‌,ఏయన్నార్‌ రెండు కళ్లయితే, ఎస్వీ రంగారావు గుండెలాంటి వారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిండైన విగ్రహం, మంచివాచకం, పాత్రకు తగిన అభినయం ఇవన్నీ ఆయన సొంతం. ఆ తరం ప్రేక్షకుల నుంచి ఈతరం ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకొన్న వ్యక్తి ఎస్వీ రంగారావు. ముఖ్యంగా ఖంగుమనే ఆయన కంఠం, కన్నులతో ఆయన చూపే భావాలు ప్రేక్షకులకు గుర్తుండిపోయేటట్లు చేశాయి. నటనలోగాని, డైలాగ్స్‌లో గాని ఆయన ఎవరిని అనుకరించలేదు. భారీ డైలాగ్స్‌ సైతం అవలీలగా చెప్పగల్గిన నటుడు ఎస్వీఆర్‌. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నేడు ఆ మహానటుడి శత జయంతి ఈ సందర్భంగా ఆయన నట జీవితంలోని జరిగిన కొన్ని విశేషాలు, సంఘటనలు..మనసు మార్చుకుని దుమ్ము దులిపేశారు!.

SV Ranga Rao birth anniversary

పది పేజీల సీన్‌ అక్షరం పొల్లుపోకుండా..‘తాతా-మనవడు’ (1973) విజయం తర్వాత నిర్మాత కె.రాఘవ అదే బృందంతో ‘సంసారం సాగరం’ చిత్రాన్ని ఆరంభించారు. అందులో కీలకమైన పాత్ర ధరించిన ఎస్వీఆర్‌ కోసం రచయిత, దర్శకుడు దాసరి ప్రత్యేకంగా పెద్ద సీన్‌ రాశారట. ఆ సీన్‌ కోసం మద్రాసు విక్రం స్టూడియోలో ఓ రోజంతా కాల్‌షీట్‌ తీసుకున్నారట. షూటింగ్‌కి వచ్చిన ఎస్వీఆర్‌ సీన్‌ మొత్తం విని, స్క్రిప్ట్‌ తీసుకుని పది పేజీల సీన్‌ని ఐదు పేజీలకు కుదించి, ‘మీరు రచయిత కదా అన్ని పేజీలు రాస్తే ఎలా?’ అంటూ దాసరి నారాయణరావు మీద విసుక్కున్నారట. అప్పుడు దాసరి ‘మీకు మీ ఒక్క పాత్ర గురించే తెలుసు. నాకు మొత్తం సినిమాలో అన్ని పాత్రల గురించి తెలుసు.

కథ ప్రకారం మొత్తం పది పేజీల సీన్‌ ఉండాల్సిందే’ అని బదులిచ్చారట. వెంటనే ఎస్వీఆర్‌ రుసరుసలాడుతూ మేకప్‌ తీసేసి వెళ్లిపోయారట. షూటింగ్‌ ఆగిపోవడంతో నిర్మాత రాఘవ, దాసరి మీద విసుక్కుని, ఎస్వీఆర్‌ని బతిమాలేందుకు తన కారులో ఆయనను అనుసరించారట. చాలా దూరం వెళ్లిన తర్వాత ఎస్వీఆర్‌ కారు వెనక్కి తిరగడంతో ‘మరో షూటింగ్‌కి వెళ్లిపోతున్నాడు కాబోలు!’ అని భయపడుతూ రాఘవ తన కారును కూడా వెనక్కి తిప్పారట. ఎస్వీఆర్‌ కారు తిన్నగా ‘సంసారం సాగరం’ షూటింగ్‌ జరుగుతున్న విక్రం స్టూడియోకే చేరుకుందట.

svr family rare pic

మనసు మార్చుకున్న ఎస్వీఆర్‌ మళ్లీ మేకప్‌ వేసుకుని రచయిత దాసరి రాసిన పది పేజీల సీన్‌ మొత్తాన్ని ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా అద్భుతంగా పండించారట. మొత్తం ఒకరోజు పడుతుందనుకున్న సీన్‌ ఎస్వీఆర్‌ మనసు పెట్టడంతో కేవలం రెండు గంటల్లో పూర్తయిందట.రాఘవాచార్య ప్రభావం యస్‌.వి.రంగారావు తనమీద బళ్లారి రాఘవాచార్య ప్రభావం ఎక్కువ అని చెప్పేవారు. ‘‘నేను రాఘవాచార్య నటించిన సాంఘికాలు, పురాణాలు, ఇంగ్లీషు నాటకాలూ అన్నీ చూసేవాడిని. ఆయన డైలాగ్‌ చెప్పే విధానం, టైమింగ్‌ అన్నీ బాగా పరిశీలించేవాడిని. డైలాగ్‌ మాడ్యులేషన్‌ రాఘవని చూసి నేర్చుకున్నాను. ‘సంతానం’ సినిమాలో నా పాత్ర గుడ్డివాడి పాత్ర. అందుకని అంధుడైన ఒక బిచ్చగాడిని చూసి, అతని ప్రవర్తనని, విన్యాసాల్నీ పరిశీలించి, ఆ ధోరణిలో నటించాను’’ అని రంగారావు చెప్పారు.

SV Ranga Rao birth anniversary

నియమ నిబంధనలకు అతీతుడు నట చక్రవర్తి ఎస్వీఆర్‌రూల్స్‌ లేని ఏకైక నటుడుఅప్పట్లో సేలంలో మోడరన్‌ థియేటర్స్‌ స్టూడియో ఉండేది. వాళ్లు వివిధ భాషల్లో అదే సంస్థ పేరు మీద 100 చిత్రాలకు పైగా తీశారు. మోడరన్‌ థియేటర్స్‌ వ్యవహారం చాలా పద్ధతిగా ఉండేదట. హిందీ చిత్రం ‘ఉస్తాదోంకో ఉస్తాద్’ ఆధారంగా 1966లో వారు ‘మొనగాళ్లకు మొనగాడు’ తీశారు. ఇందులో ఎస్వీఆర్‌ ముఖ్య పాత్రధారి. షూటింగ్‌ జరిగే ఫ్లోర్‌లో ఎవరూ సిగరెట్‌ కాల్చకూడదు. కావాలనుకుంటే ఫ్లోర్‌ బయటకు వెళ్లి కాల్చుకోవాలి. ఇలాంటి రూలు ఇంకే స్టూడియోలోనూ లేదు. ఈ రూల్స్‌ భరించలేక ‘అన్నా చెల్లెలు’ చిత్రం నుంచి జగ్గయ్య తప్పుకొన్నారు. అలాగే ఫ్లోర్‌లో ఏమీ తినకూడదు. ఉదయం అల్పాహారం, 11 గంటలకు టీ, కాఫీ ఇస్తారు. మధ్యలో ఏది అడిగినా ఇవ్వరు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం. అందరూ భోజనానికి డైనింగ్‌ హాల్‌కు వెళ్లాలి.

అక్కడ టేబుల్‌పై అరిటాకు, పక్కనే చిన్న కేరియర్‌ ఉంటాయి. ఎవరూ ఉండరు. ఎవరికి వారు వెళ్లి అక్కడ కూర్చొని వడ్డించుకుని తినాలి. ఆకు, ఖాళీ కేరియర్‌ అక్కడే వదలివేసి, చెయ్యి కడుక్కొని రావాలి. అంతా శాకాహారమే. సరిపోయేంత భోజన పదార్థాలు ఉండేవి. అయితే, ఎస్వీఆర్‌కు ఈ రూల్స్‌ అన్నింటి నుంచి మినహాయింపు, ఆయన గదికే భోజనం ఇతర సదుపాయాలు వెళ్లేవి. ఆ మహానటుడిపై వారికున్న గౌరవం అలాంటిది.సినిమాలు చేస్తూనే నాటికలు కూడా వేశారురంగస్థల నటుడిగా విభిన్న పాత్రలు పోషించి, వెండితెరపై తిరుగులేని నటుడిగా రాణించారు ఎస్వీ రంగారావు. అయితే సినిమాల్లో వేసిన ప్రఖ్యాత నటులు నాటకాల్లో నటిస్తే ఆ నాటకానికి అదనపు ప్రయోజనం కలుగుతుందని టెక్కెట్టు కొనుక్కొని వస్తారని భావించారు. ఇందులో భాగంగానే ‘పంజరంలో పక్షులు’, ‘భూకైలాస్‌’ నాటకాల్లో ఎస్వీఆర్‌ ముఖ్యపాత్రలు వేశారు. కానీ, ఎక్కువ ప్రదర్శనలు ఇవ్వలేకపోయారు.

svr

దాంతో ఆయన విరమించుకున్నారు.అంజలిగా మారిన ఎస్వీఆర్‌‘మాయా బజార్‌’లో ఘటోత్కచుడు మాయ శశిరేఖ రూపంలో నానా అల్లరీ చేయడం కథలో భాగం. అలా స్త్రీ, పురుష పాత్రలు పరస్పరం మారిన సందర్భాలు చాలా సినిమాల్లో ఉన్నాయి. కానీ, పురుష పాత్ర ప్రధానంగా రాసుకున్న కథతో కొంతమేర చిత్రీకరణ పూర్తి చేసిన తర్వాత అది స్త్రీ పాత్రగా మారిన ఓ సందర్భం ఇది. కథలో ప్రధాన పాత్ర రామభక్తుడు. అనాథలైన ఓ తల్లికీ, ఆమె కుమార్తెకూ తన ఇంట ఆశ్రయం ఇస్తాడు. ఇరవయ్యేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడతాడు. చివరకు ఆ అమ్మాయికి పెళ్లి చేసే సమయానికి ఆ తల్లీ, కూతుళ్లు తన కుమారుడిని హత్య చేసిన దుర్మార్గుడి భార్యాబిడ్డలని తెలుస్తుంది.

SV Ranga Rao birth anniversary

తీవ్రమైన ఘర్షణ నేపథ్యంలో ఆ రామభక్తుడు నిండు మనసుతో వారిని క్షమించి ఎప్పటిలాగే ఆదరిస్తాడు. ఇదీ ఇతివృత్తం. ఎస్వీ రంగారావు ప్రధాన పాత్రలో మొదటి షెడ్యూల్‌ పూర్తి అయింది. రెండో షెడ్యూల్‌ నాటికి ఎస్వీఆర్‌ మరణించడంతో చిత్రం ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దుక్కిపాటి మధుసూదనరావు, రచయిత గొల్లపూడి మారుతీరావు కలిసి చర్చించుకుని ఎస్వీఆర్‌ పాత్రను మహిళా పాత్రగా మార్చి అంజలీ దేవితో ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. అదే 1975లో విడుదలైన లలితా మూవీస్‌ వారి ‘చల్లని తల్లి’ చిత్రం.తెలుగు తెరపై ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన ఎస్వీ రంగారావు జన్మించింది జులై 3, 1918 అయితే, ఆయన మరణించింది.. జులై 18, 1974 కావడం విశేషం. ఆయన పుట్టిన నెల, చనిపోయిన నెల కూడా జులై కావడం కాకతాళీయమే. ఆయనలా హావభావాలు పలికించే నటుడు ఇంతవరకూ రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆయన నటించిన పాత్రలు వేలాది అభిమానుల హృదయాల్లో నిత్యం నిలిచే ఉంటాయి. ఆయన ఎప్పటికీ ప్రేక్షకులకు యశస్వీ రంగారావు.