శ్రీ కోదండరామాలయంలో వేడుక‌గా శ్రీరామపట్టాభిషేకం

AP News Devotional Featured Posts Trending ttd news
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఏప్రిల్ 12,2022: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వేడుక‌గా జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఆ త‌రువాత చతుర్దశకలశ స్నపన తిరుమంజనం చేప‌ట్టారు.

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీరామపట్టాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మైంది. రాత్రి 8.30 గంటల వరకు ఈ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ముందుగా విష్వ‌క్సేన‌‌పూజ‌, పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్ర‌తిష్ట‌, య‌జ‌మాని సంక‌ల్పం, స్వామివారికి వ‌స్త్ర స‌మ‌ర్ప‌ణ‌, లక్ష్మీ ప్ర‌తిమ పూజ‌, స్వామివారికి కిరిట స‌మ‌ర్ప‌ణ చేశారు. త‌రువాత ప్ర‌ధాన హోమం, పూర్ణాహూతి, సీత‌మ్మ‌వారికి, ల‌క్ష్మ‌ణ స్వామికి, ఆంజ‌నేయ‌స్వామివారికి రాముల‌వారి న‌గ‌లను బ‌హూక‌రించారు. అనంత‌రం నివేద‌న‌, హార‌తి, చ‌తుర్వేద పారాయ‌ణం, మ‌హా మంగ‌ళ‌హార‌తి, య‌జ‌మానికి వేద ఆశీర్వాదం చేశారు. శ్రీరామపట్టాభిషేకం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ‌

ఏప్రిల్ 14 నుంచి 16వ తేదీ వరకు తెప్పోత్సవాలు

శ్రీకోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 16వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజ నం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదు చుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.