టీటీడీ నకిలీటిక్కెట్లు విక్రయిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠా అరెస్ట్… నిందితుల్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా..

AP News Devotional Featured Posts Trending ttd news
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి4, 2022: తిరుమల శ్రీవారి దర్శనానికి నకిలీ టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఒకానొక కేసులో వైకుంఠం-1లో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఎం.కృష్ణారావు, తిరుమల లడ్డూ కౌంటర్ లో పనిచేస్తున్న అరుణ్ రాజు, తిరుపతిలోని ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్న బాలాజీ, నరేంద్ర. తిరుమల ప్రత్యేక ప్రవేశ కౌంటర్‌ అధికారులు, మరో కేసులో చెంగారెడ్డి, దేవేంద్రప్రసాద్‌, వెంకట్‌లను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన జితేంద్ర కుమార్ సోనీ, అతని స్నేహితులకు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ముఠా సభ్యులు రూ.21 వేలకు ప్రత్యేక దర్శన టిక్కెట్లను విక్రయించారు.

కౌంటర్‌లో స్కానింగ్ చేయకుండానే టికెట్లు పంపుతున్న ఆపరేటర్ నరేంద్రను గమనించిన టీటీడీ విజిలెన్స్ ఉద్యోగులు అతడిని అరెస్ట్ చేసి తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా కర్నూలు జిల్లా పెద్దాపురంకు చెందిన మధుసూదన్ రావు కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వచ్చారు. చెంగారెడ్డి ముఠా సభ్యులు రూ.300 నకిలీ టిక్కెట్లను ఒక్కొక్కటి రూ.3,300లకు విక్రయించి శ్రీవారి దర్శనానికి పంపారు. దర్శన కౌంటర్‌లో నకిలీ టిక్కెట్లను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు భక్తుల నుంచి సమాచారం సేకరించి తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు కేసుల్లో నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ల నుంచి మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్ భక్తులకు సూచించారు. నకిలీ టిక్కెట్లు విక్రయిస్తున్న ఏజెంట్లను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.