Sat. Apr 20th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ ,డిసెంబర్ 5, 2021:మహారాష్ట్రలో వరి సేకరణ జరుగుతున్న తీరును కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే పరిశీలించారు. దీనిలో భాగంగా సుధాంశు పాండే బంద్రా జిల్లాలోని కర్దా లో ఏర్పాటైన వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. భారత ఆహార సంస్థ, మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సేకరణ సంస్థల ప్రతినిధులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. వరి సేకరణ జరుగుతున్న తీరు పట్ల పాండే సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, సేకరణ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలను మెరుగు పరచాలని ఆయన అధికారులకు సూచించారు. వరి సేకరణ కేంద్రం వద్ద శ్రీ పాండే రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. వివిధ పథకాల కింద ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను పొందాలని ఆయన రైతులను కోరారు. వరి వయస్సును నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని అమలు చేస్తున్నదని శ్రీ పాండే రైతులకు వివరించారు. దీనివల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని, పంట సేకరణ పెరుగుతుందని ఆయన అన్నారు.

వరి సేకరణ కేంద్రాన్ని సందర్శించిన తరువాత అధికారులతో కలిసి శ్రీ పాండే  కర్దా లో ఒక చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చేశారు. దుకాణ యజమాని, కొంతమంది లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రేషన్ సరఫరా సరుకులు పంపిణీ జరుగుతున్న తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. 

ప్రధానమంత్రి ప్రకటించిన విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్‌) సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని శ్రీ పాండే వెల్లడించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వరి సేకరణ జరుగుతున్న గోండియా, భండారా, చంద్రాపూర్‌ జిల్లాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం తయారీ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహించాలని రాష్ట్ర అధికారులకు శ్రీ పాండే సూచించారు. 

వరి సేకరణ జరుగుతున్న జిల్లాలో వరి నుంచి తవుడు నూనె ను తయారు చేసే యూనిట్లను నెలకొల్పాలని శ్రీ పాండే మహారాష్ట్ర అధికారులకు సూచించారు. చిరు ధాన్యాల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. పంట మార్పిడి కార్యక్రమాన్ని అమలు చేసి చిరు ధాన్యాల ఉత్పత్తి ప్రోత్సహించాలని ఆయన అన్నారు. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ ప్రకటించిందని ఆయన అన్నారు. మొక్కజొన్న సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర అధికారులకు శ్రీ పాండే సూచించారు. ఇథనాల్ ఉత్పత్తి కోసం ధాన్యం ఆధారిత డిస్టిలరీలను ఏర్పాటు చేయాలని అన్నారు. 

అనంతరం కేంద్ర ఆహార కార్యదర్శి  అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు, భారత ఆహార సంస్థ మహారాష్ట్ర ప్రాంత అధికారులు  శ్రీ.  విజయ్ వాఘమారే, శ్రీ ఎంఎస్ సారంగ్, నాగపూర్ డివిజినల్ కమిషనర్ శ్రీమతి ప్రజాకత లవంగరే వర్మ, గోండియా కలెక్టర్ , శ్రీమతి నయన గుండె,భండారా కలెక్టర్  శ్రీ  సందీప్ కదమ్, వార్థ కలెక్టర్ , శ్రీమతి.  ప్రేరణ దేశభ్రతర్, డిప్యూటీ   కమిషనర్ (సరఫరా) శ్రీ రమేష్ ఆడె, భారత ఆహార సంస్థ నాగపూర్ డివిజనల్ మేనేజర్ శ్రీ  నరేందర్ కుమార్,శ్రీ  అవినాష్ దభాడే రాష్ట్ర ప్రభుత్వ సేకరణ సంస్థల అధికారులు హాజరయ్యారు. 

మహారాష్ట్రలో సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాలను భారత ఆహార సంస్థ మహారాష్ట్ర జనరల్ మేనేజర్ శ్రీ సారంగ్ వివరించారు. సమావేశంలో పంటల సేకరణ, నిల్వ, ఆహారధాన్యాల పంపిణీ అంశాలను సమావేశంలో చర్చించారు.