Sat. Apr 20th, 2024
KTR_

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 4,2023:తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టు లందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, కొందరికే ఇచ్చి వివాదాలు కొనితెచ్చుకోవడం తమకు ఇష్టం లేదని రాష్ట్ర మున్సిపల్ ,పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

కోర్టు తీర్పు మేరకు తమ సొసైటీ సభ్యులకు ఇంటి స్థలాలు కేటాయించాలని జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్స్ కో-ఆపరిటీవ్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ వంశీ నేతృత్వంలో జర్నలిస్ట్స్ ప్రతినిధి బృందం శుక్రవారం రోజు అసెంబ్లీ లాబీలో మంత్రి కేటీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేయగా, ఆయన పై విధంగా స్పందించారు.

ktr

తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పలువురు జర్నలిస్టులు నేటికి సొంత ఇండ్లు లేకుండా ఉన్నారని, వారికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉంటుందన్నారు. కొందరికే ఇంటి స్థలాలు అందించి మిగితావారందరినీ నిరాశపర్చడం సరైంది కాదన్నారు.

అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇలాంటి తలనొప్పులు వద్దని ఆయన సూచించారు. ఇందుకుగాను ఎలాంటి వివాదాలకు తావు కల్పించకుండా, అందరి సమన్వయంతో, అర్హులైన జర్నలిస్టులందరీ జాబితాను రూపొందించుకొని తన వద్దకు వస్తే, సీఎం కేసీఆర్ ను కలిసి ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని కేటీఆర్ తేల్చి చెప్పారు.