Sat. Apr 20th, 2024
KTR_

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జనవరి 30,2023: ప్రపంచ పర్యావరణ, జలవనరుల సమావేశాల్లో కీలకోపన్యాసం చేయాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు,మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావును అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నేతృత్వంలోని పర్యావరణ-నీటి వనరుల సంస్థ (ASCE-EWRI) ఆహ్వానించింది.

అమెరికా హెండర్సన్ లో వచ్చే నెల మే నెల 21తేదీ నుంచి 25 తేదీ మధ్య ఈ సమావేశాలు జరుగుతాయి. సరిగ్గా ఆరేళ్ల క్రితం 2017 మే 22 న అమెరికాలోని శాక్రమెంటోలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

KTR_

అప్పుడు ముఖ్యోపన్యాసం చేసిన కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు,నీటి సంరక్షణ కార్యక్రమాలను వివరించారు.

ఈ భారీ నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్దేశించిన సాహసోపేతమైన, ప్రతిష్టాత్మక లక్ష్యాలను ఆ నాటి సమావేశంలో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ పర్యావరణ-నీటి వనరుల సంస్థ (ASCE-EWRI) మేనేజింగ్ డైరెక్టర్ బ్రియాన్ పార్సన్స్ తో పాటు అధ్యక్షుడిగా ఎన్నికైన షిర్లీ క్లార్క్ నాయకత్వంలో ఓ ప్రతినిధి బృందం ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది.

ప్రాజెక్టు పరిధి- సామర్థ్యం తో పాటు నిర్మాణంలో చూపించిన అద్భుతమైన వేగానికి ఆ ప్రతినిధి బృందం ఆశ్చర్యపోయింది. ఇంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుపెట్టిన పలు నీటి పారుదల ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రంలో కలిగిన సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని ప్రశంసించింది.

KTR_

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఆ ప్రతినిధి బృందం, ఒక బృహత్ సంకల్పాన్ని అతి తక్కువ సమయంలోనే వాస్తవంగా మార్చినందుకు అభినందనలు తెలియచేశారు.

ఈ మెగా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానాలతో పాటు సస్యశ్యామల మాగాణంగా తెలంగాణ మారిన క్రమాన్ని సమావేశాల్లో వివరించాలని మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వాన లేఖలో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ పర్యావరణ-నీటి వనరుల సంస్థ కోరింది.

177 దేశాలకు చెందిన 150,000 కంటే ఎక్కువ మంది సివిల్ ఇంజనీర్లు అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ASCE) లో సభ్యులుగా ఉన్నారు.

1852లో స్థాపించిన ఈ సంస్థ అమెరికాలోనే పురాతన ఇంజనీరింగ్ సొసైటీ. భవిష్యత్ తరాల కోసం పర్యావరణ సమస్యల పరిష్కారంతో పాటు నీటి వనరుల సంరక్షణ కోసం ఈ సొసైటీ పనిచేస్తుంది.