Thu. Dec 1st, 2022
Human-Milk-Bank
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్16: కిమ్స్ ఆస్పత్రి తెలంగాణలో మరో అరుదైన ఘనత సాధించింది. నవంబర్ 17న ‘ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ డే’ను పురస్కరించుకుని కొండాపూర్ లోని కిమ్స్ కడిల్స్ ఆస్పత్రిలో ‘హ్యూమన్ మిల్క్ బ్యాంక్’ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు.


ఈ ‘హ్యూమన్ మిల్క్ బ్యాంక్’ నెలలు నిండకముందే జన్మించిన 400 మందికి పైగా శిశువులను కాపాడుతుంది. కిమ్స్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లి పాల డిమాండ్, సరఫరాలో భారీ అంతరం వల్లే హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అవసరమైంది. అనేక వైద్యపరమైన కారణాల వల్ల చాలామంది తల్లులు నెలలు నిండకముందే పుట్టిన తమ పిల్లలకు పాలు ఇవ్వలేరు. ఇలాంటి వారికి మిల్క్ బ్యాంక్ దేవుడు పంపిన అవకాశం లాంటిది. ఇది ఈ లోపాన్ని గణనీయంగా పరిష్కరిస్తుంది.

జాతీయ స్థాయిలో చూసినా గణాంకాలు చాలా భయంగొలిపేలా ఉన్నాయి. అధికారిక సమాచారం ప్రకారం, అకాల జననాలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం 24 మిలియన్ల మంది పిల్లలు పుడతారు. వీరిలో 3.5 మిలియన్లు నెలలు నిండక ముందే జన్మిస్తున్నారు. పుట్టిన వెంటనే దాదాపు 0.76 మిలియన్ల మంది నవజాత శిశువులు మరణిస్తున్నారు. నవజాత జననాలు, మరణాలు ప్రపంచంలో ఎక్కువగా మన దేశంలోనే ఉంటున్నాయి.

Human-Milk-Bank

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముందస్తుగా, ప్రత్యేకంగా ఇచ్చే తల్లి పాలు, మదర్స్ ఓన్ మిల్క్ (ఎంఓఎం) అనేది అత్యంత ముఖ్యం. ఇది నిస్సహాయ నవజాత శిశువుల మరణాలు, అనారోగ్యాలను తగ్గిస్తుంది. బిడ్డకు సరైన శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన అన్ని ముఖ్యమైన పోషకాలు, ఎదుగుదల కారకాలు తల్లిపాలలో ఉంటాయి.

అంటువ్యాధులు, ఆహారం పడకపోవడం, నెక్రోటైజింగ్ ఎంటరోకోలైటిస్ ను తల్లి పాలు తగ్గిస్తాయి. వీటిలో ఈ లక్షణాలను తగ్గించే యాంటీ ఇన్ఫెక్టివ్ కారకాలుంటాయని నిరూపితమైంది. నవజాత శిశు మరణాలకు ఇవే ప్రధాన కారణాలు. పిల్లల జీవితానికి అమృతప్రాయమైనా.. తల్లిపాలు అనేక కారణాల వల్ల నెలలు నిండకముందే పుట్టి, తక్కువ బరువున్న పిల్లలకు అందడం లేదు.

మంచి సంకేతం ఏమిటంటే, తల్లి పాలు అందుబాటులో లేనప్పుడు, ముఖ్యంగా నెలలు నిండకముందే పుట్టిన శిశువుకు, దాతలు అందించే పాలు ఉత్తమ ఎంపిక అని కిమ్స్ కడిల్స్ ఆస్పత్రి నియోనాటాలజీ అండ్ పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ అపర్ణ సి ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు.

హైదరాబాద్ లో ఉన్న తల్లిపాల బ్యాంకులు అవసరాలకు సరిపోవని గ్రహించిన కిమ్స్ కడిల్స్.. సామాజిక బాధ్యతను తన భుజాన వేసుకోవాలని సొంతంగా తల్లిపాల బ్యాంకు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. సాధారణంగా తమ ఆస్పత్రిలో పుట్టిన పిల్లలకు తల్లిపాలు అవసరమైనప్పుడు ఈ పాల బ్యాంకులను ఉపయోగించుకుంటారు. ఒకవేళ పాలు మిగిలితే, ఒక నోడల్ ఏజెన్సీ ద్వారా ఇతర ఆస్పత్రులకూ పంపుతారు.

“నెలలు నిండకముందే పుట్టి, బాగా తక్కువ బరువున్న పిల్లలకు నూటికి నూరుశాతం తల్లిపాలు అందించాలన్న ఉద్దేశంతో కిమ్స్ కడిల్స్ ఈ బ్యాంకును ఏర్పాటుచేసింది. మా నియమావళిలో భాగంగా, శిక్షణ పొందిన మా సిబ్బంది దాతలుగా ముందుకొచ్చే తల్లులను స్క్రీనింగ్ చేస్తారు. వారికి తగిన విధంగా కౌన్సెలింగ్ ఇస్తారు. అంటువ్యాధులున్నాయేమోనని పరీక్షిస్తారు. పాలను సేకరించి, పాశ్చరైజ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసి, బాగా అవసరంలో ఉన్న శిశువులకు ఆ పాలు పంపిణీ చేస్తారు” అని ఆమె వివరించారు.

Human-Milk-Bank

“కిమ్స్ కడిల్స్ లోని మా నియోనాటల్ యూనిట్ ప్రతి నెలా దాదాపు 150 మంది నవజాత శిశువులకు సేవలందిస్తుంది. ఇందులో ఇక్కడే పుట్టినవారు, వేరేచోట పుట్టినవారూ ఉంటారు. ఈ అడ్మిషన్లలో 20-25% వరకు 34 వారాల గర్భధారణ కంటే ముందే పుట్టిన.. నెలలు నిండని నవజాత శిశువులు అని అంచనా. ఇలాంటివారికి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. చాలామంది అనారోగ్యంతో ఉన్నవారు, నెలలు నిండకముందే పుట్టినవారు కావడంతో వాళ్లకు తొలి వారంలో తల్లిపాలు అందవు. అలాంటివారికి తల్లిపాల బ్యాంకులు ఒక వరం” అని ఆమె అన్నారు.

అనేక మంది అర్హులైన తల్లులు స్వచ్ఛందంగా పాలు దానం చేయడానికి సుముఖత చూపడం మంచి పరిణామం. ఈ బ్యాంకుల్లో పాలను ఒక సంవత్సరం వరకు నిల్వ చేయవచ్చు. అవసరమైనప్పుడు పాలను తీసి, ద్రవ స్థితికి తీసుకొచ్చిన తర్వాత ఉపయోగిస్తారు.

ఏ రోజైనా సగటున తమ తల్లిపాల బ్యాంకు నుంచి కనీసం ఐదుగురు శిశువులకు పాలు అవసరం అవుతాయని కిమ్స్ కడిల్స్ భావిస్తోంది. తల్లిపాల బ్యాంకులను ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్లు గణనీయంగా తగ్గుతాయని, ఎన్ఈసి 65% తక్కువ అవుతుందని, మరణాల రేటు కూడా దాదాపు సగం తగ్గిందని డాక్టర్ అపర్ణ సి చెప్పారు.