Fri. Mar 29th, 2024
cheating

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి 4, 2022: దేశంలోని దేశీయ విమాన ప్రయాణికులను మోసం చేశారన్న ఆరోపణలపై గుంటూరుకు చెందిన మోడెలా వెంకట దినేష్ కుమార్‌ను ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేసినట్లు ఐజీఐ విమానాశ్రయం డిప్యూటీ పోలీస్ కమిషనర్ సంజయ్ త్యాగి ఓ ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలోని ప్రఖ్యాత యూనివర్సిటీ విద్యార్థిగా నటిస్తూ భారత విమానాశ్రయాల్లోని విమాన ప్రయాణికులను కుమార్ టార్గెట్ చేశాడు.

దినేష్ కుమార్ టికెట్ కొనుక్కుని, సాధారణ ప్రయాణీకుడిగా విమానాశ్రయాలలోకి ప్రవేశించి, ఫ్లైట్ పట్టుకోవడం “మిస్” అయ్యేవాడు. అప్పుడు అతను “ఆపదలో ఉన్న విద్యార్థిగా నటిస్తూ ప్రయాణికులను సంప్రదించి, తన సొంత ఊరు విశాఖపట్నానికి వెళ్లేందుకు టిక్కెట్ కొనడానికి ప్రయాణికులను సహాయం కోరతాడు. టిక్కెట్ కొనడానికి తనవద్ద సరిపడా డబ్బులేదని, మరికొంత డబ్బు అవసరమని చెప్పేవాడు.తన గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని నమ్మబలికేవాడు. ప్రయాణీకులను తన ఖాతాలోకి నగదు బదిలీ చేయమని కోరుతాడు.

డిసెంబరు 30న ఐజిఐ ఎయిర్‌పోర్ట్ టి-2 టెర్మినల్ నుంచి మరో ప్రయాణికుడిని ఇదే విధంగా మోసం చేసేందుకు ప్రయత్నించిన నిందితుడు పట్టుబడ్డాడు. గత ఐదేళ్లలో కుమార్ పలువురు ప్రయాణికులను మోసం చేశాడని సంజయ్ త్యాగి తెలిపారు. ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాల్లో నిందితునిపై ఏడు కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా మరికొంత మంది బాధితులు ఉండవచ్చని ఆయన వెల్లడించారు.