Fri. Mar 29th, 2024
chintha-mohan

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, నవంబర్ 9,2022: కాపు సామజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలంటే కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అని, పవన్ కళ్యాణ్ గానీ, చిరంజీవి గానీ ముఖ్యమంత్రి కావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ సంచలన కామెంట్స్ చేశారు. వైసిపి, టిడిపిలో కాపు, బలిజలు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు. భవిష్యత్తులో కూడా ఆ అవకాశం రాదని ఆయన వెల్లడించారు.

ముఖ్యమంత్రి కావాలని కాపు, బలిజలు కోరుకుంటున్నారు. ఆ సామాజిక వర్గం ఆలోచనలు నెరవేరాలంటే కాంగ్రెస్ తో సాధ్యం అవుతున్నదని డాక్టర్ చింతామోహన్ పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల దేశ ప్రజల దగ్గర డబ్బు ఆవిరి అయిపోయింది. నోట్ల రద్దుకు కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నోట్ల రద్దు వల్ల రైతులు, వర్తకులు, సామాన్యుల వద్ద డబ్బు లేదని, ఏడేళ్ల క్రితం డబ్బుకు కొదవ లేకుండా బతికేవారు. నేడు చేతిలో రూపాయి లేక, అష్ట కష్టాలు పడుతున్నారని చింతామోహన్ అన్నారు.

chintha-mohan

దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కారణం భారతీయ జనతా పార్టీ, నోట్ల రద్దు. ఇది అనాలోచిత నిర్ణయమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో దళితుల పరిస్థితి అధ్వానంగా ఉందని,దళిత విద్యార్థులు స్కాలర్షిప్లు రాక 50 శాతం మంది గ్రామాల్లో కూలీలుగా మారుతున్నారని డాక్టర్ చింతామోహన్ తెలిపారు.

ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడం వల్ల దళిత నిరుద్యోగ యువత అష్ట కష్టాలు పడుతున్నారు. 50 మంది డిఎస్పి ల బదిలీలలో 29 మంది రెడ్డి సామాజిక వర్గానికి కీలక స్థానాల్లో పోస్టింగ్ ఇవ్వడం, దళిత వెనుకబడిన వర్గాలను అవమానపరచడమేనని చింతామోహన్ అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.2024 ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య పోటాపోటీ ఉంటుందని డాక్టర్ చింతామోహన్ వెల్లడించారు.