Thu. Jun 1st, 2023
Spread the News

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 8, హైదరాబాద్: సమాజం అభివృద్ధి చెందాలంటే ఎవరొకరు ముందడుగు వేయాలి. ఎవరో వస్తారు ఎదో చేస్తారని ఎదురు చూడకుండా ఆయనే ఓ అడుగు వేశారు. ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా తన వంతుగా సమాజం లోని అన్ని వర్గాల వారికి సాయం అందిస్తూ ‘అందరి శ్రేయోభిలాషి’ అనిపించుకుంటున్నారు ఏవి కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత‌ జక్కా వెంకట్‌ రెడ్డి.  

 పర్యావరణ పరిరక్షణ కోసం
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని చెప్పడమే కాదు ఆయనే స్వయంగా చేసి చూపిస్తున్నారు. నిత్యం వినియోగించే వస్తువుల్లో ప్లాస్టిక్‌ ఉత్పత్తులే ఎక్కువ. అటువంటి ఉత్పత్తుల వాడకం వల్ల పర్యావరణానికి కలిగే దుష్పరిణామాలను గురించి జనాలకు వివరిస్తూ వారిని చైతన్యపరుస్తున్నారు జక్కా వెంకట్‌రెడ్డి. ఇంటింటికీ తిరిగి వేలాది కుటుంబాలకు ఉచితంగా నార సంచులను పంపిణీ చేస్తున్నారు. రైతు బజార్ల్లు, చేపల మార్కెట్లు, కిరాణాషాపులు, మెడికల్‌ షాపులు, మటన్‌, చికెన్‌ దుకాణాలు, ఫంక్షన్‌ హాళ్ల యజమానులకు ప్లాస్టిక్‌ ఉత్పత్తులను నిషేధించాలంటూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. పదేండ్లుగా ప్లాస్టిక్‌ ఉత్పత్తుల నిషేధంపై ఉద్యమం చేస్తున్నారు.

మహిళలను ప్రోత్సహిస్తూ
స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రోత్సహించడం కోసం వారు తయారుచేసే నార సంచులను కొనుగోలు చేస్తున్నారు. వారి నుంచి కొన్న పదిహేను వేల నార సంచులను ఉచితంగా పంపిణీ చేస్తూ పర్యావరణాన్ని కాపాడడమేకాకుండా, మహిళలకు చేయూతనందిస్తున్నారు.

 వృక్షాల రక్షణ
ఫిర్జాదిగూడాలోని రోడ్లు, వీధులు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి చెత్త నిర్వహణా కార్యక్రమాన్ని అమలు చేశారు. పచ్చదనాన్ని కాపాడేందుకు మొక్కలు నాటడమేకాకుండా వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలోని 80 కాలనీల్లో మొక్కలు నాటారు. ప్రతీ కాలనీకి 20 ట్రీ గార్డుల చొప్పున 1600లకు పైగా ఉచితంగా పంపిణీ చేశారు.

 వర్షపు నీటిని వృధా కానీయకుండా
భూగర్భ జలాలను పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారు. వర్షపు నీటిని వృధా కానీయకుండా ఒడిసి పట్టేందుకు ఇంకుడుగుంతలు తవ్వించారు. కాలనీల్లో ఇంకుడుగుంతలను ఏర్పాటు చేయిస్తూ భూగర్భ జలాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకుడుగుంతలకు అయ్యే ఖర్చును ఆయనే భరిస్తున్నారు. సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల చెరువులన్నీ మురుగునీటితోనే నిండుతున్నాయి. చెరువులను వర్షం నీటితో నింపాలనే లక్ష్యంతో ప్రత్యేక నమూనాలను రూపొందించారు.

 నిరుపేద విద్యార్థులకు
ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రతి ఏటా సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేస్తున్నారు. మేడిపల్లి హైస్కూల్‌, మల్లికార్జున్‌నగర్‌లలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని వాటి బాగోగులు చూస్తున్నారు. ఉన్నత చదువులపై ఆసక్తి ఉన్న పేద పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. సర్కారీ బడుల్లో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండంతో విద్యా వలంటీర్లను నియమించి వారికి జీతాలు ఇస్తున్నారు.

 వారి బాగోగులు చూస్తూ
ఏ.వి.కన్‌స్ట్రక్షన్స్‌ అధినేతగా విల్లా, అపార్ట్‌మెంట్‌లను ఎంత శ్రద్ధతో నిర్మిస్తారో, అదే విధంగా సమాజం ముందుకు వెళ్లడానికి అవసరమైన సౌకర్యాలను అంతే శ్రద్ధతో అందిస్తూ తన వంతు కృషి చేస్తున్నారు. మహిళలకు స్వయం ఉపాధి, విద్యార్థులకు విద్యాదానం, యువతకు ప్రోత్సాహం అందించడంతోపాటు, సీనియర్‌ సిటిజన్ల అవసరాలను గుర్తించి వారి బాగోగులు చూస్తున్నారు. సమాజంలో అన్ని వర్గాల వారికి తోచిన సాయం అందిస్తున్నారు.సమాజం ముందుకు వెళ్లాలంటే ఎవరో వచ్చి ఏదోచేస్తారని ఎదురు చూడకూడదు. అందుకోసం ఎవరో ఒకరు అడుగు ముందుకు వేయాలి. వృత్తిపరంగా వ్యాపార వేత్త. ఆయన ప్రవృత్తి మాత్రం సమాజ సేవ. సంపాదనలో 25 శాతం సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ, నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పాటు పడుతున్నారు ఫిర్జాదిగూడకు చెందిన జక్కా వెంకట్‌ రెడ్డి. అన్ని వర్గాల వారికి తనవంతు సాయమందిస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.

అందరూ చేతులు కలిపితేనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రగతి సిద్ధిస్తుంది. పర్యావరణాన్ని కాపాడడంలో అందరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అప్పుడే పది కాలాల పాటు అంతా సుభిక్షంగా ఉంటాం.
– జక్కా వెంకట్‌ రెడ్డి, ఏవి కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత‌