Fri. Mar 29th, 2024
Horticulture_365t

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఫిబ్రవరి 5, 2023: పండ్ల తోటలకు కావలసిన నాణ్యమైన మొక్కల ఉత్పత్తి సరఫరా, డిమాండ్ ల మధ్య భారీ అంతరం ఉందని, అందువల్ల ఉద్యాన నిపుణులకు ఈ రంగంలో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం హార్టికల్చర్ డీన్ డాక్టర్ అడపా కిరణ్ కుమార్ అన్నారు.

నాణ్యమైన మొక్కలు ఎంచుకున్నప్పుడే పండ్ల తోటల్లో దిగుబడులు, నాణ్యత అధికంగా పొంది రైతుకు తోటల సాగు లాభదాయకంగా ఉంటుందని ఆయన తెలిపారు.

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నిధులతో నిర్వహిస్తున్న “తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన మొక్కల ఉత్పత్తికి పండ్ల తోటల స్థాపన, నిర్వహణ పై సర్టిఫికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం”లో భాగంగా వనపర్తి జిల్లా మోజర్ల ఉద్యాన కళాశాల విద్యార్థులు సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానాన్ని సందర్శించారు.

Horticulture_365t

ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ స్టార్ట్ అప్ యుగంలో నైపుణ్యం ఉంటేనే విజయం వరిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రమంతా పండ్ల తోటల నర్సరీలకు అత్యంత డిమాండ్ ఉందని, దీన్ని ఔత్సాహికులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సందర్శనలో భాగంగా వేరుమూలం, సయాన్ లక్షణాలు, వాటి ఎంపిక, మొక్కలు అంటుకట్టే విధానం, తక్కువ ఖర్చుతో నాణ్యమైన అంట మొక్కలు ఉత్పత్తి, అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను శాస్త్రవేత్త డాక్టర్ పి.హరికాంత్ వివరించారు.

కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పిడిగం సైదయ్య, డాక్టర్ జె.శ్రీనివాస్, డాక్టర్ నితీష్ విద్యార్థులు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికార్లు పాల్గొన్నారు.