
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 29,2022: అత్యంత అరుదైన పాంక్రియాసైటిస్ ఇన్ఫ్లమేషన్తో బాధపడుతున్న గర్భిణిని, ఆమె కడుపులో ఉన్న ఇద్దరు కవలల ప్రాణాలను కాపాడినట్లు నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఎల్జీ ఆస్పత్రిలో వైద్యులు ప్రకటించారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు దాదాపు వారం రోజుల పాటు చేసిన ప్రయత్నాలతో మూడు ప్రాణాలనూ కాపాడగలిగారు.
26 ఏళ్ల వయసున్న శ్రీమతి దేవి (వ్యక్తిగత గోప్యత కోసం పూర్తిపేరు వెల్లడించట్లేదు) గర్భంతో ఉండగా ఎనిమిదో నెలలో.. అంటే మార్చి 16న కడుపు పైభాగంలో తీవ్రమైన నొప్పి, ఆగకుండా వాంతులు అవుతుండటంతో అత్యవసరంగా ఎస్ఎల్జీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. గర్భం సమయంలోనే పాంక్రియాసైటిస్ రావడం అరుదైతే, అందులోనూ లోపల కవలలు ఉన్నప్పుడు మరింత అరుదు. కానీ పరీక్షలలో అదే తేలింది. ఇలాంటి పరిస్థితిలో సమర్థంగా చికిత్స చేయకపోతే తీవ్రమైన ఒత్తిడి కారణంగా మూడు ప్రాణాలకు ప్రమాదముంది.

ఈ కేసు సంక్లిష్టత గురించి ఎస్ఎల్జీ ఆస్పత్రుల కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్, గైనకాలజిస్టు డాక్టర్ శిరీష ముళ్లమూరి మాట్లాడుతూ,“గర్భవతులకు పాంక్రియాసైటిస్ రావడం చాలా అరుదు. సుమారు పదివేల మందిలో ఒకరికి రావచ్చు. గర్భవతులు కానివారితో పోలిస్తే గర్భవతులకు ఇలాంటి సందర్భంలో చికిత్స భిన్నంగా ఉంటుంది. కానీ శ్రీమతి దేవి విషయంలో మాకు ఇదో పెద్ద సవాలు. ఆమె అనేక చికిత్సలు తీసుకున్న తర్వాత గర్భం దాల్చారు.32 వారాల పాటు కవలలు బాగున్నందుకు ఆమె చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఉన్నట్టుండి కడుపులో విపరీతమైన నొప్పి, వాంతులు మొదలయ్యాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా పాంక్రియాసైటిస్ అయి ఉంటుందనే అనుకున్నాం. కానీ గర్భవతులకు అది రావడం చాలా అరుదు. వెంటనే వైద్య పరీక్షలు చేశాం.
ముందుగా ఆమెకు నొప్పిని తగ్గించి, గర్భాన్ని కాపాడాలన్నది మా మొదటి ఆలోచన. కానీ, గర్భం కారణంగా పాంక్రియాసైటిస్ మరింత తీవ్రంగా మారింది, శరీరంలో మిగిలిన అవయవాలనూ ప్రభావితం చేయడం మొదలైంది. ముఖ్యంగా మూత్రపిండాలు, కాలేయం, గుండె పనితీరు క్రమంగా మందగించింది. దాంతో నెలలు నిండకపోయినా అత్యవసర ఎల్ఎస్సీఎస్ చేయడం ద్వారా ప్రసవం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రసవం తర్వాత ఆమె కోలుకోడానికి దాదాపు వారం రోజులకు పైగా పట్టింది. పిల్లలిద్దరూ 1.7 కిలోలు,1.8 కిలోలు మాత్రమే ఉండటంతో పిల్లల వైద్యనిపుణుల పర్యవేక్షణలో ఉంచాం” అని చెప్పారు.

“ఇది ఒక ఆస్పత్రి, అందులోని వైద్యుల పనితీరును ప్రతిబింబించే లాంటి కేసు. డాక్టర్ శిరీష, డాక్టర్ శిల్ప, డాక్టర్ అరవింద్ (పీడియాట్రీషియన్), డాక్టర్ సుహాసినీ తిరుమల (క్రిటికల్ కేర్ విభాగాధిపతి), ఆమె బృందం, డాక్టర్ శ్రీనివాస్ (ఎనస్థీషియా), డాక్టర్ తేజశ్రీ, ఇంకా.. ఈ మూడు ప్రాణాలను కాపాడేందుకు నిస్వార్థంగా సేవలందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు, అత్యుత్తమ వైద్యులున్న ఆస్పత్రిగా ఎస్ఎల్జీ ఆస్పత్రి మరోసారి తన పేరు నిరూపించుకుంది” అని ఎస్ఎల్జీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీవీఎస్ సోమరాజు హర్షం వ్యక్తం చేశారు.
మార్చి 23వ తేదీనే దేవి, ఆమె ఇద్దరు కవలలను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినా, వారు ముగ్గురినీ రిమోట్ పరిశీలనలోనే ఉంచాం. తరచు వారు వైద్యులను సంప్రదించాలని చెప్పాం. నెలలు నిండకముందే పుట్టడంతో కవలలకు సరైన సంరక్షణ అవసరం. వాళ్లను దాదాపు నెల రోజుల పాటు నిశితంగా పరిశీలించిన తర్వాతే అంతా బాగుందని చెప్పగలిగాం. తల్లీబిడ్డలు ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ ప్రభావాల నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని సంతోషంగా గడపగలరు.