Fri. Mar 29th, 2024
thanduru-kandi_

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి31,2023: తెలంగాణ రాష్ట్రంలో భౌగోళిక గుర్తింపు పొందిన పంటల సాగు చేపడుతూనే, మార్కెట్ లో డిమాండ్ ఉన్న నూనె గింజలు, పప్పు దినుసులు, ఉద్యాన పంటల సాగును కూడా చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి సూచించారు.

తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు లభించిన సందర్భంగా, రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల కు తాండూరు పరిశొధన కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భౌగోళిక గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని యాలాల్ రైతు ఉత్పత్తిదారుల ప్రతినిధులకు మంత్రి, కేంద్ర వాణిజ్య శాఖ ప్రతినిధులతో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయం అన్ని వృత్తుల కన్నా గౌరవప్రదమైన వృత్తి అని అయితే దానికి ఆధునిక టెక్నాలజీని జోడించడం వల్ల మరింత లాభదాయకం చేయవచ్చన్నారు.

మూస పద్ధతిలో వ్యవసాయం లాభదాయకం కాదని వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా అధిక దిగుబడిని ఇచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు.

పాలమూరు-రంగారెడ్డి ద్వారా తాండూరు ప్రాంతానికి కూడా నీళ్లు అందుతాయని, కాకపోతే సాగునీరు వచ్చిందని కంది పంట సాగు నుంచి వైదొలగొద్దన్నారు.

thanduru-kandi_

సాంప్రదాయ పంటలే లాభదాయకమే కాకుండా మార్కెట్ లో మంచి ధర పొందవచ్చని అన్నారు. జియో ఇండికెశన్ పొందిన తాండూరు కంది అంశాన్ని పాట్యాంశంగా చేర్చేందుకు కృషి చెస్థానన్నారు.

ఈ సందర్భంగా జియో ట్యాగ్ పొందిన తాండూరు కంది ఉత్పత్తిని మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు శాసనసభ్యులు పి. రోహిత్ రెడ్డి అధ్యక్షత వహించారు.

ఈసందర్బంగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్ కలెక్టర్ నిఖిల తదితరులు ప్రసంగించారు. తాండూరులో కందిబోర్డును ఏర్పాటు చేయాలని వక్తలు కోరారు.

ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్ కుమార్, పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, తాండూరు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ సుధాకర్, డాక్టర్ సి. సుధా రాణి, పాలెం ఎడిఆర్ డాక్టర్ గోవర్ధన్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు,రైతులు పాల్గొన్నారు.