Fri. Apr 19th, 2024
అంగన్వాడీ బీమా సదుపాయం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 6,2021తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి అనేక రంగాలలో రోల్ మోడల్ గా నిలుస్తూ, మరెన్నో రంగాల్లో దిక్సూచిగా ఉంటోంది. తాజాగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలను కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిస్తూ వారికి 50 లక్షల రూపాయల బీమా సదుపాయం కేంద్రం కల్పించడంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కృషియే ప్రధాన కారణమని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు.

కోవిడ్ తర్వాత కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి, వారికి 50 లక్షల రూపాయల బీమా సదుపాయం కల్పించిందన్నారు. కానీ అంగన్వాడీలకు మాత్రం ఈ బీమా సదుపాయం కల్పించలేదని తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కూడా ఈ 50 లక్షల రూపాయల బీమా వసతి కల్పించాలని 2021 జూన్ 23వ తేదీన కేంద్రానికి లేఖ రాశామన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 3వ తేదీన కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ గారిని ప్రత్యేకంగా కలిసి అంగన్వాడీలకు 50 లక్షల బీమా సదుపాయం కల్పించాలని కోరినట్లు తెలిపారు.

గత నాలుగు నెలలుగా చేస్తున్న కృషికి ఫలితంగా కేంద్రం అంగన్వాడీలకు 50 లక్షల బీమా సదుపాయం కల్పించడం సంతోషదాయకమన్నారు. ఇందుకు కేంద్రానికి, ముఖ్యంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ గారికి కృతజ్ణతలు తెలిపారు.

కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన అంగన్వాడీ సిబ్బంది కృషికి గుర్తింపు లభించిందని, వారికి బీమా సదుపాయం రావడం ద్వారా వారి ఆత్మస్థైర్యం పెరిగిందని, వారందరికీ అభినందనలు తెలిపారు.