June 5, 2020
  • June 5, 2020
Breaking News
  • Home
  • Trending
  • భాగ్యనగరంలో హెలీ టూరిజం

భాగ్యనగరంలో హెలీ టూరిజం

By on December 8, 2015 0 492 Views

త్వరలో గగన విహారం ద్వారా నగర అందాల్ని వీక్షించే ఏర్పాట్లు

జనవరిలో అంతర్జాతీయస్థాయిలో పెరల్స్ ఫెస్టివల్

తెలంగాణ రాష్ట్ర గిరిజన,పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వెల్లడి.

365తెలుగు డాట్ కాం ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 8, హైదరాబాద్ : పర్యాటకులు హైదరాబాద్ నగరాన్ని హెలికాప్టర్ల ద్వారా తిలకించే అవకాశం కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. పర్యాటకశాఖ ద్వారా త్వరలో ఈ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర పర్యాటక, గిరిజనాభివృద్ధి, సాంస్కృతిక శాఖల మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు.హెలీ టూరిజంతో పాటు సీ ప్లేన్, హాట్ ఎయిర్ బెలూన్‌ల సహాయంతో హైదరాబాద్ నగరాన్ని ఆకాశం నుంచి వీక్షించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నామని ఆయన వివరించారు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్‌లో పర్యాటకశాఖ పనితీరును మంత్రి సమీక్షించారు. జనవరిలో హైదరాబాద్‌లో పెరల్స్ ఫెస్టివల్‌ను అంతర్జాతీయస్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రపంచ పటంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం దక్కేలా ప్రయత్నిస్తున్నామన్నారు. విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించేలా ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించేందుకు టూర్ ఆపరేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ట్రైబల్, ఎకో టూరిజంలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతం పరిసరాల్లోని సోమశిల, ఫరహాబాద్, మల్లెలతీర్థం, శ్రీశైలం ప్రాంతాలను ఎకో టూరిజం కింద, వరంగల్ జిల్లాలోని మేడారం, లక్నవరం, తాడ్వాయి, మల్లూరు, గట్టమ్మ దేవాలయాలను ట్రైబల్ టూరిజంలో భాగంగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వివరించారు. త్వరలోనే బౌద్ధ, జైన, రామాయణ సర్క్యూట్‌లుగా తెలంగాణలోని పలు ప్రాంతాలను అభివృద్ధి చేయబోతున్నామని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించామని ఆయన తెలిపారు. పర్యాటక ప్రాంతాలను సందర్శించే పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక రాయితీలను ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, టూరిజంశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టినా చోంగ్తు తదితరులు పాల్గొన్నారు.