Fri. Apr 26th, 2024

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్ ,మార్చి 4,2024: ఒకప్పటి కన్నా ఇప్పుడు జీవనకాలం గణనీయంగా పెరిగింది. ఆరోగ్యకరమైన జీవన విధానం.. యాంటీబయోటిక్స్‌, టీకాల వంటి అధునాతన చికిత్సల వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. మరి ఆరోగ్యంగా లేకపోతే, శరీరం సహకరించకపోతే ఎక్కువకాలం బతికినా జీవితాన్ని ఏం ఆస్వాదిస్తాం? అందుకే కొన్ని సూత్రాలు పాటించటం మంచిది. వీటితో చురుకుగా, ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఆయుష్షునూ పెంచుకోవచ్ఛు.

● బరువు అదుపు చేసుకోండి: మితిమీరిన బరువు గలవారికి ఆయుష్షు గణనీయంగా తగ్గిపోయే అవకాశముందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అధిక బరువు ఉన్నవారు కనీసం 10% బరువు తగ్గినా మధుమేహం వంటి దీర్ఘకాల సమస్యల ముప్పు తగ్గించుకున్నట్టే.

● పళ్లు తోముకోండి: గుండెజబ్బులు, మధుమేహం వంటి సమస్యలకూ నోటి శుభ్రతకు సంబంధముంది. నోటిలోని బ్యాక్టీరియా రక్తంలో కలిసి ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. నోటి ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే రక్షకాలు సైతం ఒంట్లో ఎక్కడైనా వాపు ప్రక్రియను ప్రేరేపించొచ్ఛు.

● కళ్లను పరీక్షించుకోండి: క్రమంగా చూపు తగ్గిపోయే వృద్ధులకు 8 ఏళ్ల కాలంలో మరణించే ముప్పు 16% వరకు పెరిగే అవకాశముంది. చూపును సరిచేసుకోవటం లేదా తగ్గిపోయిన చూపునకు అనుగుణంగా జీవన విధానాన్ని మార్చుకోవటం ద్వారా మరణించే ముప్పును తగ్గించుకోవచ్చన్నది పరిశోధకుల భావన.

● ఎముకలను బలంగా ఉంచుకోండి: వయసుతో పాటు ఎముకలు క్షీణిస్తూ వస్తాయి. వ్యాయామంతో దీన్ని తగ్గించుకోవచ్చు గానీ వృద్ధాప్యంలో అందరికీ సాధ్యం కాకపోవచ్ఛు ఇలాంటివారు బైఫాస్ఫోనేట్‌ రకం మందులతో ఎముకలను బలోపేతం చేసుకుంటే అకాల మరణం ముప్పు 34% వరకూ తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

● దీర్ఘంగా శ్వాస తీసుకోండి: వయసు మీద పడుతున్నకొద్దీ శ్వాసనాళాలు సాగటం తగ్గుతుంది, శరీర భంగిమ మారుతుంది, ఊపిరితిత్తుల కింద ఉండే పొర (డయాఫ్రం) బలం సన్నగిల్లుతుంది. ఫలితంగా ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది.

శరీరం చురుకుగా, ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ఆక్సిజన్‌ను తీసుకోవటం కష్టమవుతుంది. రోజుకు 5-10 నిమిషాల సేపు డయాఫ్రం మీద మనసును లగ్నం చేసి దీర్ఘంగా శ్వాస తీసుకోవటం ద్వారా త్వరగా ఇలాంటి మార్పులు తలెత్తకుండా చూసుకోవచ్ఛు