Fri. Apr 19th, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్30,హైదరాబాద్: అది 2000వ సంవత్సరం కెరీర్, డబ్బుల పరంగా నాకు బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. ఉమ్మడి కుటుంబసభ్యుల బాధ్యతలు నాపై ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను. ఆ సమయంలో శ్రీసింహాకు నాలుగేళ్లు ఉంటాయి. ఓ రోజు సింగపూర్ వెళ్లాలనే ప్రతిపాదన ఇంట్లో వచ్చింది. అక్కడకు వెళ్లేంత డబ్బులు నా దగ్గర లేవని చెప్పాను. అయితే నేను తీసుకెళతా అని శ్రీసింహ అన్నాడు. ఆ ప్రామిస్‌ను ఈ సినిమాతో వచ్చిన పారితోషికం ద్వారా శ్రీసింహా నెరవేర్చుతాడనే నమ్మకముంది అని అన్నారు కీరవాణి. ఆయన తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా, మరో తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైన చిత్రం మత్తు వదలరా. మైత్రీ మూవీస్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చెర్రి, హేమలత ఈ చిత్రాన్ని నిర్మించారు. రితేష్‌రానా దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం మత్తువదలరా ఎవల్యూషన్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి కీరవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ నూతన తారాగణంతో చేసిన ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ప్రమోషన్స్‌ను రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా చేశాం. ఆ వైవిధ్యతే సినిమా పట్ల అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. కంటెంట్ ఈజ్ కింగ్ ఈ సినిమా మరోసారి నిరూపించింది అని చెప్పారు. ప్రస్తుతం ఇలాంటి వైవిధ్యమైన కథలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాంటి సినిమాలే ఎక్కువగా పేరు, గుర్తింపు తెచ్చిపెడతాయి. కాన్సెప్ట్ ఓరియెంటెండ్ సినిమాలతో కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎదిగినప్పుడే సంతృప్తి ఉంటుంది. ఆ ఆలోచనతో ఈ సినిమాలో నటించాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మైత్రీ సంస్థలోనే హీరోగా తొలి సినిమా చేయడం ఆనందంగా ఉంది అని శ్రీసింహా చెప్పారు. కాలభైరవ మాట్లాడుతూ అరంగేట్రానికి చిన్న సినిమాను ఎంచుకోవడానికి కారణమేమిటని చాలా మంది అడుగుతున్నారు. సినిమాల్ని సెలెక్ట్ చేసే లగ్జరీ మాకు లేదు. సినిమా అవకాశం రావడమే గొప్ప విషయం. కథాబలమున్న మంచి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ప్రేక్షకులంతా నేపథ్య సంగీతంతో కనెక్ట్ కావడం సంతోషాన్ని కలిగించింది అన్నారు.

దర్శకుడు రితేష్ రానా మాట్లాడుతూ కామెడీ, రొమాంటిక్ ట్రాక్‌లు లేకుండా సినిమా తీయాలంటే నిర్మాత మమ్మల్ని నమ్మాలి. చెర్రి,మైత్రీ నిర్మాతలు నన్ను, నా కథను పూర్తిగా నమ్మి ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే కాన్ఫిడెన్స్‌తోనే చేశారు. 40, 50 ఏళ్ల వయసు వారు పాటలు లేకపోయినా సినిమా బాగుందని చెబుతున్నారు. శ్రీసింహాను ఆడిషన్ ద్వారానే ఎంచుకున్నాం. సిట్యువేషన్ కామెడీకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమా రూపొందించాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రవిశంకర్, చెర్రి (చిరంజీవి) నరేష్ అగస్త్య , సురేష్ సారంగం, థామస్ తదితరులు పాల్గొన్నారు.