Thu. Apr 25th, 2024

365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి31,హైదరాబాద్: ఉద్యోగ ధర్మాన్ని క్రమం తప్పకుండా పాటించేది సానిటరీ సిబ్బందేనని, వారు చేసే పనితో మొత్తం మున్సిపల్ వ్యవస్థనే మంచి పేరు గడిస్తుందని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ జక్కా వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో రోడ్లపై పనిచేస్తున్న సానిటరీ సిబ్బంది ని కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు మేయర్ వద్ద పలు సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా రాత్రి సమయాలలో రోడ్లు ఊడ్చేటప్పుడు ప్రమాదాలకు గురవుతున్నామని, రేడియం తరహా జాకెట్లను, మాస్క్లను గ్లవ్సెస్ ఇప్పించాలని, అలాగే దుమ్ము ధూళితో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నామని, వైద్యం చేయించుకోవాలంటే కమిషనర్ అనుమతితో ఈఎస్ఐ ఆసుపత్రులలో వైద్యం చేస్తున్నారని అలా కాకుండా కార్మికులందరికీ డైరెక్ట్ గా ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని కోరారు.

కార్మికుల సమస్యలను నిశితంగా విన్న మేయర్ కార్మికుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కారం లభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఉద్యోగి బాగుంటే యజమాని బాగుంటాడు అనే నియమాన్ని పాటిస్తానని మీ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. అలాగే పబ్లిక్ టాయిలెట్లు పెంచుతామని ఆయన అన్నారు. వేతనం సమయానికి అందేలా చూస్తామని జక్క వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.