Thu. Apr 18th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, జనవరి7,హైదరాబాద్: 19వ శతాబ్దపు ప్రారంభ కాలానికి చెందిన ఒక కథ (చరిత్ర) ఇప్పటికీ కేరళ సాంప్రదాయంలో చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ లేని విధంగా కేరళలోని ట్రావెన్ కోర్ సంస్థానంలో హిందూ దళిత స్త్రీలు తమ చాతి మీద వస్త్రాన్ని కప్పుకోవడానికి #ములక్కరం అనే చాతి వస్త్రపు సుంకంను అక్కడి బ్రాహ్మణ పాలకుడికి చెల్లించాల్సి వచ్చేది. చాతిని కప్పుకోవాలనుకున్న స్త్రీలు ఈ పన్ను తప్పకుండా చెల్లించాలి.లేదంటే చాతిపై వస్త్రం లేకుండానే బహిరంగంగా తిరగవలసి ఉంటుంది. ఇది అగ్రవర్ణ/కుల స్త్రీలకు వర్తించదు. సంస్థానంలోని #చర్తాలా గ్రామంలో గల #ఎజావా కులానికి చెందిన మహిళ, #నంగేళి ఈ అసభ్యకరమైన సుంకాన్ని చెల్లించడానికి నిరాకరించడమే కాకా, బహిరంగంగానే తన ఒంటిపై వస్త్రం కప్పుకొనేది. ఒకరోజు ఆ గ్రామ సుంకాధికారి నంగేళీని ములక్కరం చెల్లించవలసిందేనని వేదించగా, ఆమే తన రెండు స్తనాలను కొడవలితో కోసి అరటాకులో పెట్టి సుంకం కింద వాటిని తీసుకెళ్ళమని చెప్పింది. తీవ్ర రక్తస్రావంతో నంగేళీ కొద్దిసేపటికే మరణించింది. ఖండితమైన తన భార్య శరీరాన్ని చూసిన నంగేళి భర్త చిరుకందన్ తీవ్రమైన వేదనతో ఆమే చితిలోనే దూకి ప్రాణత్యాగం చేసాడు. (బహుశా ఇది చరిత్రలో మొదటి పురుష సతీసహాగమనం).



నంగేళి ప్రాణత్యాగానికి చలించిపోయిన ట్రావెన్ కోర్ రాజా వెంటనే ఈ చాతివస్త్రపు పన్నును రద్దు చేస్తున్నట్లు ‌ప్రకటించాడు. ఆమే నివసించిన ప్రాంతానికి #మూలచిపరంబు (Land of the Breasted woman) పేరు పెట్టారు. ఉపసంహారం: అయితే ఇది చరిత్ర కాదు, కేవలం కథేనని కొట్టిపారేసేవారున్నారు. నిజానికి గ్రామీణ కేరళ స్త్రీలలో ఇలా చాతిపై వస్త్రం లేకుండా బహిరంగంగా తిరిగే అలవాటు సర్వసాధారణమేనని, బ్రిటీష్ వారు కేరళ ప్రాంతం వచ్చిన తరువాతనే వీరంతా సంస్కరించబడ్డారనీ అనే వారూ ఉన్నారు. వారు వస్త్రం ధరిస్తే సుంకం విధించడం కల్పితమని కొందరి వాదన. కాని ఇటీవలి కాలంలో బయల్పడిన పురవస్తు ఆధారాలు నంగేళి ఉదంతాన్ని బలపరుస్తున్నాయి. ఎన్నో టెర్రకొట్ట బొమ్మలు నంగేళి ఉదంతపు వాస్తవాలను విశిదికరిస్తున్నాయి. చరిత్ర ఎప్పుడూ పాలకుల ప్రగల్భాలనే కాకుండా అణగారిన వర్గాల వేదన, పీడన, భాద, వివక్షతలను అప్పుడప్పుడు బయటకు తీస్తుంది. ప్రస్తుతం సబాల్ట్రన్ హిస్టరీ ఇటువంటి కనుమరుగైన ఎన్నో చారిత్రక ఉదంతాలను బోదిస్తుంది.